Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్‌

25 Dec, 2023 09:03 IST|Sakshi
మహ్మద్‌ షమీ- తెంబా బవుమా (PC: BCCI/CSA)

Ind vs SA 2023 Test Series: పటిష్ట టీమిండియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా అన్నాడు. గత దశాబ్దకాలంగా భారత జట్టు టెస్టుల్లో మరింత ప్రమాదకారిగా మారిందని.. వారిని ఓడించడం అంత సులువేమీ కాదని పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థులకు గట్టి సవాల్‌ విసురుతున్నారని కొనియాడాడు.

సఫారీ గడ్డపై అందని ద్రాక్షగానే
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్‌.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ క్రమంలో.. సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ విజయంపై కన్నేసింది. ప్రొటిస్‌ జట్టుపై పైచేయి సాధించి చరిత్రాత్మక గెలుపు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.

ఇందుకోసం ఇప్పటికే రోహిత్‌ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరు జట్ల మధ్య మంగళవారం (డిసెంబరు 26) నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా మీడియాతో మాట్లాడాడు.

టీమిండియాను తేలికగా తీసుకోం
ఈ సందర్భంగా టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ గైర్హాజరీ గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికర సమాధానమిచ్చాడు. షమీ జట్టుతో లేకపోయినా.. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఏ టీమిండియా బౌలర్‌ అయినా తమను ఒత్తిడిలోకి నెట్టగలడని బవుమా పేర్కొన్నాడు. భారత బౌలింగ్‌ విభాగం పటిష్టమైందని.. వారిని తేలికగా తీసుకోమని స్పష్టం చేశాడు.

‘‘ఒక క్రికెటర్‌గా.. ముఖ్యంగా బ్యాటర్‌గా అత్యుత్తమైన ప్రత్యర్థితో తలపడాలని భావించడం సహజం. మహ్మద్‌ షమీ అలాంటి కోవకే చెందుతాడు. అతడు అద్భుతమైన పేసర్‌. మాలో చాలా మంది అతడి బౌలింగ్‌లో ఆడాలని కోరుకుంటారు.

షమీ లేకపోయినా.. టీమిండియా టీమిండియానే
అయితే, అతడు లేకపోయినా టీమిండియా.. టీమిండియానే.. అతడి స్థానంలో ఎవరు వచ్చినా మాపై ఒత్తిడి పెంచగలడు. ఎందుకంటే భారత బౌలింగ్‌ లైనప్‌ ప్రస్తుతం అలా ఉంది. సొంతగడ్డపై ఆడటం మాకు సానుకూలాంశమే అయినా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో పోటీ అంటే సవాలే.

సిరీస్‌ గెలిచి తీరతాం
గత ఐదు- పదేళ్ల కాలంలో వారు టెస్టుల్లో అద్భుతమైన విజయాలు సాధించారు. భారత బౌలింగ్‌ అటాక్‌ వల్లే ఇది సాధ్యమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు’’ అని తెంబా బవుమా టీమిండియా బౌలింగ్‌ విభాగంపై ప్రశంసలు కురిపించాడు.

అయితే, భారత జట్టుపై స్వదేశంలో తమకు ఉన్న అజేయ రికార్డును తప్పకుండా నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా బవుమా ధీమా వ్యక్తం చేశాడు. కాగా గాయం కారణంగా షమీ జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో ముకేశ్‌ కుమార్‌ లేదంటే ప్రసిద్‌ కృష్ణ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

చదవండి: WFI: సస్పెన్షన్‌ ఎత్తివేయాల్సిందే! మా దగ్గర సాక్ష్యాలున్నాయి!

>
మరిన్ని వార్తలు