కిమ్‌ తల వెనుక మిస్టీరియస్‌ స్పాట్‌!

4 Aug, 2021 02:54 IST|Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(37) ఆరోగ్యంపై మళ్లీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన తల వెనుక భాగంలో బ్యాండేజీ, తర్వాత పెద్ద మచ్చ కనిపించడమే ఇందుకు కారణం. అది మిస్టీరియస్‌ స్పాట్‌ అంటూ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. జూలై 24 నుంచి 27 దాకా జరిగిన కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ కార్యక్రమంలో కిమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల వెనుక భాగంలో బ్యాండేజీ ఉన్న దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. తర్వాత ఈ బ్యాండేజీ లేదు. దానికింద ఉన్న మచ్చ కనిపించింది. కిమ్‌కు ఏం జరిగినా, ఆయన ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందన్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మే నెలలో బాగా లావుగా కనిపించిన కిమ్‌ జోంగ్‌ ఉన్న జూన్‌లో చాలా సన్నబడ్డారు. ఈ వార్త ఉ.కొరియా శత్రుదేశాల్లో చర్చనీయాంశమైంది. భారీ కాయంతో కంటికి నిండుగా కనిపించే తమ అధినేత బక్క పలుచగా మారడాన్ని చాలామంది ఉత్తర.కొరియన్లు తట్టుకోలేకపోయారట. కొందరైతే కన్నీరు పెట్టుకున్నారట! కిమ్‌ ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం అసాధారణ సంకేతాలేవీ లేవని, ఆయన బాగానే ఉన్నారని ఉత్తర కొరియాకు శత్రు దేశమైన దక్షిణ కొరియా నేషనల్‌ ఇంటలిజెన్స్‌ సర్వీసు చెబుతోంది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌కు తల వెనుక భాగంలో టెన్నిస్‌ బంతి సైజ్‌లో కణితి ఉండేది.  

మరిన్ని వార్తలు