చైనా నుంచి భారత్‌కు కంపెనీలు తరలిస్తే రాయితీలు

5 Sep, 2020 08:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కంపెనీలకు జపాన్‌ ఆఫర్‌ 

బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు 

టోక్యో: చైనా నుంచి భారత్, బంగ్లాదేశ్‌లకు తరలించే తమ కంపెనీలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆసియాన్‌ దేశాలన్నింటిలోనూ తమ దేశానికి చెందిన సంస్థలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఈ రాయితీల కోసం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. 2020 –21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆసియాన్‌ ప్రాంతంలో కంపెనీల విస్తరణకు ప్రోత్సహించాలని 23,500 కోట్ల యెన్‌లు (22.1 కోట్ల డాలర్లు) కేటాయించింది.

చైనాలో ఉన్న సంస్థలు ఏమైనా తమ ప్రొడక్షన్‌ యూనిట్లను భారత్‌ లేదంటే బంగ్లాదేశ్‌కు తరలిస్తే భారీగా రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా నిక్కీ ఏసియాన్‌ రివ్యూ నివేదిక వెల్లడించింది. ఔషధ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్ని ఆసియా దేశాలన్నింటికీ విస్తరించాలన్నదే జపాన్‌ ప్రభుత్వం లక్ష్యం. ప్రస్తుతం జపాన్‌కి చెందిన ఉత్పత్తి ప్లాంట్లు అత్యధికంగా చైనాలోనే ఉన్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో వాటి నుంచి సరఫరా ఆగిపోయింది.

కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనాయే కారణమని ప్రపంచమంతా వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి కంపెనీలను తరలిస్తే జపాన్‌ రాయితీలు ఇస్తామనడం చర్చనీయాంశమైంది. అందులోనూ భారత్‌కి తరలిస్తే ప్రోత్సహాకాలు ఇవ్వాలనుకోవడంతో మన దేశంలో పెట్టుబడులు పెరుగుతాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. (దురాక్రమణ దుస్సాహసం)

మరిన్ని వార్తలు