-

పిల్లల వ్యక్తిగత డేటాను తస్కరించిన ‘మెటా’

28 Nov, 2023 06:00 IST|Sakshi

ఫేస్‌బుక్, ఇన్‌స్టా మాతృ సంస్థపై అమెరికా కోర్టులో 33 రాష్ట్రాల దావా 

శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్‌ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ ‘మెటా’పై  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని మెటా సేకరించిందని, ఎక్కువ సమయం తమ సామాజిక మాధ్యమాల వేదికల్లోనే వారు గడిపేలా ఒక బిజినెస్‌ మోడల్‌ను రూపొందించిందని అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల డేటాను తస్కరించేలా ఉద్దేశపూర్వకంగానే తమ సోషల్‌ మీడియా వేదికల్లో మెటా మార్పులు చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మెటా సంస్థ నిర్వాకంపై గత నెలలో 33 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ కోర్టులో దావా వేశారు. ఈ సంగతి తాజాగా బయటకు వచి్చంది. యుక్త వయసులో ఉన్నవారిని సోషల్‌ మీడియా సైట్లవైపు ఆకర్శించడానికి, ప్రలోభాలకు గురిచేయడానికి మెటా ప్రయతి్నస్తోందని వారు ఆరోపించారు. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఇన్‌స్టాగ్రామ్‌ సేకరించిందని, ఇలా చేయడం చట్టవిరుద్ధమేనని తమ దావాలో పేర్కొన్నారు.

చిన్నారుల గోప్యతను కాపాడడానికి ఉద్దేశించిన చట్టాలను మెటా పాటించలేదని ఆరోపించాయి. తమపై వచి్చన ఆరోపణలపై మెటా యాజమాన్యం స్పందించింది. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్‌ మీడియా వేదికల్లో ఖాతాలు తెరవడానికి అనుమతి లేదని వెల్లడించింది. ఒకవేళ అలాంటి ఖాతాలు ఉంటే తొలగిస్తామని ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదికలు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయని ఏళ్లుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా వార్తలతో వాటికి మరింత బలం సమకూరిందని అభిప్రాయపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు