Mexico: నేరస్తుల చేతికి ‍ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది?

18 Dec, 2023 08:09 IST|Sakshi

నేరాలకు, హత్యలకు, దోపిడీలకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మెక్సికో దేశం కేంద్రంగా మారింది. ఇప్పుడు ఇక్కడి నేరస్తులు ప్రభుత్వం ఉపయోగించే డేటాబేస్‌ను వినియోగించి మరీ నేరాల్లో మరో ముందడుగు వేశారని వైస్‌ న్యూస్‌ నివేదిక వెల్లడించింది. 

మెక్సికన్ నేరస్తులు తాము టార్గెట్‌ చేసుకున్న వారి వివరాలను, చివరికి వారి లైవ్‌ లొకేషన్‌ను తెలుసుకునేందుకు ప్రభుత్వ సంస్థలు ఉపయోగించే ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ డేటాబేస్‌ను యాక్సెస్ చేస్తున్నాయని నిఘా వర్గాలు తమకు తెలియజేశామని వైస్‌ న్యూస్‌ పేర్కొంది. 

నేరస్తులు  తాము టార్గెట్‌ చేసుకున్న వారి వివరాలను  జియోలొకేట్ ద్వారా తెలుసుకునేందుకు వారు టైటాన్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. తద్వారా తాము టార్గెట్‌ చేసిన వారి ప్రైవేట్ సమాచారంతోపాటు వారికి సంబంధించిన పత్రాలను పొందుతూ అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. 

10 వేల మెక్సికన్ పెసోలు (రూ. 600) నుండి 1,80 వేల పెసోలు (రూ. 9,000) చెల్లించి నేరస్తులు వివిధ టైటాన్ సేవలను పొందుతున్నారని వైస్ న్యూస్ తెలియజేసింది. ఈ విధంగా నేరస్తులు అధికారికంగా టైటాన్‌ సేవల సొంత లాగిన్‌ పొందుతూ, ఆధునిక మార్గాల్లో తమ నేరాలను కొనసాగిస్తున్నారు. 

నిజానిక్‌ టైటాన్‌ సేవలను ఉపయోగించేందుకు పోలీసు బలగాలు సంబంధిత లైసెన్స్‌లను కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఆ లైసెన్స్‌ అక్రమమార్గంలో తిరిగి బ్లాక్ మార్కెట్‌లోనూ అందుబాటులోకి వస్తున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. 

మెక్సికన్ ఓటర్ ఐడీ డేటాబేస్, క్రెడిట్ బ్యూరోలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఫోన్ యాప్‌ల లాగ్‌లు, ఇమెయిల్‌లు, ఇలాంటి సమాచారాల ఆధారంగా టైటాన్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు సులభంగా నేరస్తులను గుర్తించడానికి ఈ సాఫ్ట్‌వేర్  రూపొందించినట్లు కంపెనీ ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్‌తో సహా అనేక ప్రభుత్వాలు, రిపోర్టర్‌లు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష సమూహాలపై గూఢచర్యం చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో తేలింది. 

అయితే ఈ టైటాన్  సాఫ్ట్‌వేర్‌ అక్రమ వినియోగం వెనుక ఎవరు ఉన్నారనేది స్పష్టంగా వెల్లడికాలేదని వైస్ న్యూస్ తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫారమ్ లాగిన్ పేజీలోని ఎబౌట్‌లో ఎటువంటి సమాచారం ఉండదు. అలాగే ఈ సంస్థ సర్వర్‌లను తరచూ మారుస్తూ ఉంటుంది. బహుశా ఎవరూ ట్రాక్‌ చేయకుండా ఉండేందుకే ఇటువంటి విధానం అనుసరిస్తుంటుందని తేలింది. 

నేరస్తులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడే ఈ టైటాన్‌ సాఫ్ట్‌వేర్‌ సేవలను చట్టాన్ని అమలు చేసే వారి కన్నా.. నేరస్తులే అధికంగా ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. కాగా ఈ వివరాలపై మెక్సికన్ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. 
ఇది కూడా చదవండి: దావూద్‌ ఇబ్రహీంకు సీరియస్‌?

>
మరిన్ని వార్తలు