రికార్డుల్లోకి బర్గర్‌.. ధర ఏకంగా రూ. 4.5 లక్షలు, ఎందుకంత ఖరీదు?

11 Jul, 2021 01:32 IST|Sakshi

ఏ పని చేసినా కాస్త కళా పోషణ.. ప్రత్యేకత ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ కోవలోకే చెందుతాడు రాబర్ట్‌ జాన్‌ డీ వీన్‌. ఇంతకీ ఆయనెవరు..? అంత ప్రత్యేకమైన పని ఏం చేశాడు? సాధారణంగా బర్గర్‌ అంటే ఏ వందో రెండొందలో ఉంటుంది. ఫైవ్‌స్టార్‌ రెస్టారెంట్లలో అయితే రూ.500 వరకు ఖరీదు ఉంటుంది. మరి ఈ ఫొటోలో ఉన్న బర్గర్‌ ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.4.5 లక్షలు. ఏంటీ అంత చిన్న బర్గర్‌కు అంత ఖరీదా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ప్రత్యేకతే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన బర్గర్‌గా రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది. డీ డాల్టన్‌ అనే డచ్‌ రెస్టారెంట్‌ యజమాని అయిన రాబర్ట్‌కు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావించాడు.

వెంటనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌ అని ఇంటర్‌నెట్‌లో వెతకగా, 2011లో 352 కిలోలతో ఓరేగాన్‌ రెస్టారెంట్‌ తయారు చేసిన బర్గర్‌కు దాదాపు రూ.3,72,432 రికార్డు ధర పలికినట్లు తెలుసుకున్నాడు. దీని కన్నా ఖరీదైన బర్గర్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎక్కు వ బరువుతో చేస్తే ఆహారపదార్థాలు చాలా వ్యర్థం అవుతా యని భావించాడు. పైగా ఒక్కరే తయారుచేసేలా, ఒక్కరే ఆ బర్గర్‌ను ఆరగించేలా ఉండాలని తనకు తాను షరతు విధించుకున్నాడు. దాంతో ఖరీదైన పదార్థాలతో తయారు చేయాలనుకుని, బర్గర్‌ కోసం వాడే రొట్టె (బన్‌)ను బంగారు పూతతో పూసి, రొట్టెల మధ్య ఉంచే పదార్థాలను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటిని ఉంచాడు. దీంతో ఈ బర్గర్‌ ఖరీదు అమాంతంగా పెరిగిపోయి అత్యంత ఖరీదైన బర్గర్‌గా రికార్డులు తిరగరాసింది. దీనికి రాబర్ట్‌ ముద్దుగా పెట్టుకున్న పేరు గోల్డెన్‌ బాయ్‌..!   

మరిన్ని వార్తలు