ఓ.. బేబీ ! అమ్మాయి చదివే స్కూల్‌ సేఫేనా ?

7 Jun, 2021 13:36 IST|Sakshi

మారువేషంలో స్కూల్‌ సెక్యూరిటీ చెక్‌ చేసిన తల్లి

13 ఏళ్ల కూతురిలా వేషం వేసిన 30 ఏళ్ల తల్లి 

గుర్తు పట్టిన స్కూల్‌ యాజమాన్యం, కేసు నమోదు

వెబ్‌డెస్క్‌: తన కూతురు చదివే స్కూల్‌లో సెక్యూరిటీ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఓ తల్లి చేసిన ప్రయత్నం నెట్టింట వైరల్‌గా మారింది. 30 ఏళ్ల తల్లి 13 ఏళ్ల కూతురిలా వేశం మా‍ర్చి అందరినీ బురిడీ కొట్టించింది. ఒక రోజంతా స్కూల్‌లో స్టూడెంట్‌లానే తిరిగింది. అయితే ఆమె ప్రయత్నం చివరి నిమిషంలో బెడిసికొట్టింది. పాఠశాల యాజమాన్యం ఆ తల్లిపై కేసు పెట్టింది. 

సెక్యూరిటీ చెక్‌
అమెరికాలోని టెక్సాస్‌కి చెందిన కేసీ గార్షియా (30)కి జూలీ (13) అనే కూతురు ఉంది. ఎన్రీక్వెజ్‌ మిడిల్‌ స్కూల్‌లో జూలీ చదువుతోంది. అయితే తన కూతురు చదివే స్కూల్‌లో సెక్యూరిటీ ఎలా ఉంది ? పాపకు సరైన భద్రత లభిస్తుందా ? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? అని తెలుసుకోవాలనే కుతుహలం కేసీ గార్షియాలో పెరిగిపోయింది.

ఓ బేబీగా మమ్మీ
అనుకున్నదే ఆలస్యం 30 ఏళ్ల గార్షియా కాస్త 13 ఏళ్ల జూలీగా మారిపోయింది. జీన్స్‌ , హుడీ టీ షర్ట్‌ ధరించింది. స్పోర్ట్స్‌ షూ వేసుకుంది. ఫ్యాషనబుల్‌ గాగుల్స్‌ ధరించింది. జుట్టుకు రంగేసింది, చెవికి పోగులు పెట్టింది.... అచ్చంగా పదమూడేళ్ల టీనేజర్‌లా మారిపోయింది 30 ఏళ్ల మమ్మీ. ఈ మొత్తం తతంగాన్ని ఆమె వీడియో తీసింది.

చివరి నిమిషంలో
జూలీ బదులుగా కేసీ గార్షియానే స్కూల్‌కి వెళ్లింది. ఆమె వేషధారణ, బాడీ లాంగ్వేజ్‌ సరిగ్గా జూలీకి తగ్గట్టుగా ఉండటంతో ఎ‍క్కడా ఎవ్వరూ అనుమానించలేదు. దాదాపు రోజంతా జూలీలానే స్కూల్‌ మొత్తం తనిఖీ చేసింది కేసీ. అయితే చివరి పీరియడ్‌లో ఆమె మారువేశాన్ని ఉపాధ్యాయురాలు పసిగట్టింది.

కేసు నమోదు
తమ పాఠశాలోకి మారు వేశంలోకి రావడమే కాకుండా రికార్డులను తారుమారు చేసేందుకు కేసీ ప్రయత్నించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది పాఠశాల యాజమాన్యం. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని. కూతురు భద్రత తనకెంతో ముఖ్యమంటూ కేసీ పోలీసులకు తెలిపింది. చివరకు రూ. 5.68 లక్షల రూపాయల వ్యక్తిగత బాండ్‌ పేపర్‌పై కేసీని పోలీసులు విడుదల చేశారు. ఈ స్పై ఆపరేషన్‌కి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 

ఇక్కడ చదవండి: USA: గ్రీన్‌కార్డు నిరీక్షణకు తెరపడేనా!

మరిన్ని వార్తలు