వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు భారీ భద్రత.. వేల మందితో బందోబస్తు

18 Nov, 2023 22:15 IST|Sakshi

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 6,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యే ముఖ్య వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఇక్కడ విలేకరుల సమావేశంలో జీఎస్‌ మాలిక్ మాట్లాడుతూ మ్యాచ్‌ చూడటానికి లక్ష మందికి పైగా ప్రేక్షకులు, అనేక మంది ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ , హోంగార్డులు, ఇతర సిబ్బందితో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

‘ఈ మెగా ఈవెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూసేందుకు 6,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. వీరిలో దాదాపు 3,000 మంది స్టేడియం లోపల ఉంటారు. మరికొందరు ఆటగాళ్లు, ప్రముఖులు బస చేస్తున్న హోటళ్లు, ఇతర కీలక ప్రదేశాలలో బందోబస్తు నిర్వహిస్తారు’ అని జీఎస్ మాలిక్ వివరించారు.

ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ఒక కంపెనీ స్టేడియం లోపల, మరొకటి స్టేడియం వెలుపల  మోహరించి ఉంటుందని, నగర పోలీసుల ఆధ్వర్యంలో స్టేడియం లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐజీ, డీఐజీ ర్యాంకుకు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు 23 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు మ్యాచ్ రోజు సిబ్బందిని పర్యవేక్షిస్తారని జీఎస్ మాలిక్ పేర్కొన్నారు. వీరికి 39 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 92 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు సహాయం చేస్తారని వివరించారు.

మ్యాచ్‌లో ఏదైనా రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (CBRN) అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించడానికి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను కూడా నగరంలో మోహరిస్తామని తెలిపారు. బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన 10 బృందాలతో పాటు రెండు బృందాలు చేతక్ కమాండోస్, ఒక ఎలైట్ యూనిట్‌ను స్టేడియం సమీపంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బాంబ్‌ బెదిరింపులపై స్పందిస్తూ.. ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని ఆకతాయిగా చేసే బెదిరింపులను మీడియా హైలైట్ చేయొద్దని జీఎస్‌ మాలిక్ కోరారు.

మరిన్ని వార్తలు