యూట్యూబర్‌ క్రేజీ స్టంట్‌: ఏడు రోజులు సజీవ సమాధి, చివరికి...!

21 Nov, 2023 18:28 IST|Sakshi

పాపులారిటీ కోసం, డేర్‌డెవిల్  అని నిరూపించుకునేందుకు ఏమైనా చేయడానికి యూట్యూబర్లు ఏమాత్రం తగ్గడం లేదు. 'కిల్ బిల్'లో ఉమా థుర్మాన్ పాత్ర  తరహాలో తాజాగా ఒక పాపులర్‌ ‍యూట్యూబర్‌ ఒళ్లు గగుర్పొడిచే సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా ఏడు రోజులపాటు తనను సజీవ సమాధి చేసుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. వెన్నులో వణుకు పుట్టించే ఈ స్టంట్‌కోసం ప్రత్యేక ఏర్పాటు  చేసుకున్నాడు.  రెండు రోజుల్లోనే ఈ వీడియో 64  మిలియన్ల వ్యూస్‌ సాధించడం విశేషం.

వివరాలను పరిశీలిస్తే బీస్ట్‌గా పాపులర్‌ అయిన జిమ్మీ డొనాల్డ్‌సన్ ఈ  క్రేజీ స్టండ్‌ చేశాడు. ఏడు రోజులపాటు శవపేటిక  లాంటి  డబ్బాలో భూగర్భంలో ఉండిపోయాడు. తన 212 మిలియన్ల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లను  ఫిదా చేయాలనే ఆలోచనతోనే ఈ స్టంట్‌ చేశాడు. చివరికి అదో మానసిక వేదనరా బాబు ఇలా చేయకండి అంటూ తన ఫోలవర్లకు సూచించాడు. 

ఈ  ఫీట్‌కు తన స్నేహితులతో కలిసి ఎక్స్‌కవేటర్‌ని ఉపయోగించి శవపేటిక పైన 20వేల పౌండ్ల మట్టిని  పోయించాడు.  "రాబోయే ఏడు రోజులు నా జీవితాన్ని ఈ శవపేటికకు అప్పగిస్తున్నాను." అంటూ లోపలికి వెళ్లాడు. అయితే పైన ఉన్న తన టీంతో  కమ్యూనికేట్ చేయడానికి వాకీ-టాకీని ఉపయోగించాడు. ఎన్ని చేసినా ఏడు రోజుల పాటు అలా ఉండటం అంటే మాటలా.

చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. చాలా నీరసించిపోయాడు. కాళ్లలో రక్తం గడ్డకట్టి, నిలబడలేకపోయాడు. అదృష్టవశాత్తూ ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ ఎదురు కాలేదు.  2021లో 50 గంటల పాటు సజీవంగా సమాధి  అయ్యి రికార్డు కొట్టాలని ప్రయత్నించాడు.2012 నుండి యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, 2018లో  బీస్ట్‌ బాగా పాపులర్‌ అయ్యాడు.  అనేక విన్యాసాలు చేయడంతో పాటు, డొనాల్డ్‌సన్  వివాదాస్పదమైన దాతృత్వ చర్యలతో వార్తల్లో నిలిచాడు. 5లక్షల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఆఫ్రికా అంతటా 100 బావుల నిర్మాణం పేరుతో డబ్బులు  వసూలు  చేయడం విమర్శలకు తావిచ్చింది. 

దీనికి సంబంధించినవ  వీడియోను యూట్యూబ్‌లో షేర్‌ చేశాడు.పారదర్శకమైన శవపేటికలో  వీడియోను రికార్డ్ చేయడానికి కెమెరాలు  సహా  అవసరమైన వస్తువులతో  బీస్ట్‌ని నెమ్మదిగా భూమిలోకి దిపుతారు.  ఈ సందర్బంగా ఒ‍క్కోసారి బీస్ట్‌ భావోద్వేగానికి  లోనయ్యాడు.  బాత్రూమ్,  సహా తన దినచర్య వివరాలనుషేర్‌ చేశాడు. వీడియో చివరలో ఏడు రోజుల తరువాత సూర్యుడిని చూస్తున్నా..ఈ  అనుభవాన్ని వర్ణించలేను అనడంతో వీడియో ముగుస్తుంది.  

మరిన్ని వార్తలు