రామాయణ, భారతాలు వింటూ పెరిగాను: ఒబామా

17 Nov, 2020 15:02 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని గుర్తు చేసుకున్నారు. ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్’‌ పుస్తకంలో తన బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు."ప్రపంచ జనాభాలో ఆరవ వంతు, రెండువేల విభిన్న జాతి సమూహాలు, ఏడు వందలకు పైగా భాషలతో మాట్లాడే ప్రజలతో (భారతదేశం) పరిపూర్ణ పరిమాణం కారణంగా భారత్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది" అని ఒబామా తన తాజా పుస్తకంలో భారతదేశంపై తనకు గల ఇష్టాన్ని చెప్పుకొచ్చారు.

2010లో తన అధ్యక్ష పర్యటనకు ముందు వరకు తాను భారతదేశానికి వెళ్ళలేదని.. కాకపోతే ఆ దేశం గురించి తన మదిలో ఎప్పుడు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు ఒబామా. "నా బాల్యంలో కొంత భాగం ఇండోనేషియాలో రామాయణం మహాభారతం  పురాణ హిందూ కథలు వింటూ గడపడం వల్లనో.. తూర్పు మతాల పట్ల నాకున్న ఆసక్తి కారణంగానో.. పాకిస్తానీ, భారతీయ కళాశాల స్నేహితుల బృందం కారణంగా కావచ్చు. వారి వల్ల నాకు పప్పు, కీమా వండటం అలవాటయ్యింది.  బాలీవుడ్ సినిమాలకు  ఆకర్షితుడిని అయ్యాను" అని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. (చదవండి: అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!)

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ ఈ రోజు విడుదల అయ్యింది. (ప్రామిస్డ్‌ ల్యాండ్‌: ‘సారా పాలిన్‌ ఎవరు?’)


 

మరిన్ని వార్తలు