ప్లాస్టిక్‌ ప్రళయం

2 Oct, 2023 04:22 IST|Sakshi

ప్రపంచాన్ని కమ్మేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు 

సముద్ర, అటవీ జీవులతో పాటు మానవ ప్రాణాలకు ముప్పు 

పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లోనూ ప్లాస్టిక్‌ కణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు 

యాపిల్, బేరి పండ్లలో అత్యధికంగా ప్లాస్టిక్‌ రేణువులు 

1950లో రెండు మిలియన్‌ టన్నుల నుంచి ప్రస్తుతం 391 మిలియన్‌ టన్నులకు పెరిగిన ప్లాస్టిక్‌ కాలుష్యం 

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్లాస్టిక్‌ మింగేస్తోంది. సముద్ర జీవులు, అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది. గ్లోబల్‌ ప్లాస్టిక్‌ కాలుష్యం 1950­లో రెండు మిలియన్‌ టన్నులు ఉండగా.. తాజా వినియోగం 391 మిలియన్‌ టన్నులను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్న పనిలోనూ ప్లాస్టిక్‌పై ఆధారపడటంతో వీటి వినియోగం క్రమేపీ ఎక్కువైంది. ఇది 2040 నాటికి రెట్టింపు అవుతుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు.  

పండ్లలోనూ ప్లాస్టిక్‌ భూతమే 
మానవులు తరచూ తినే పండ్లు, కూరగాయలను కూడా ప్లాస్టిక్‌ వదలడం లేదు. తాజాగా ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యారెట్, పాలకూర, యాపిల్స్, బేరి పండ్లలో చిన్నచిన్న ప్లాస్టిక్‌ కణాలను కనుగొన్నారు. యాపిల్స్‌లో అత్యధికంగా సగటున గ్రాముకు 1.95 లక్షలు, బేరిలో 1.89 లక్షలు, క్యారెట్, బ్రొకోలీలో లక్ష వరకు అతి సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించారు. ప్లాస్టిక్‌ కలుషిత నీరు, భూమి ద్వారా ఆహార ఉత్పత్తుల్లోకి చేరుతున్నట్టు పేర్కొన్నారు. 

తాబేలు పొట్టలోనూ చేరుతోంది 
గతంలో సముద్ర తీరాల్లో అకారణంగా తాబేళ్లు మృత్యువాత పడుతుండటంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అరచేతిలో ఒదిగిపోయే చిన్న తాబేలు పొట్టలో దాదాపు 140 మైక్రో ప్లాస్టిక్‌ ముక్కలను కనుగొన్నారు. ప్రస్తుతం ఏటా 11 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ సముద్రాల్లోకి చేరుతుండగా.. ఇది వచ్చే 20 ఏళ్లల్లోపే మూడు రెట్లు పెరగనుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

800కి పైగా సముద్ర, తీర ప్రాంత జాతులను ఆహారంగా తీసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు, వారి రక్తంలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్‌ కణాలు ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. ముఖ్యంగా ప్రపంచంలో 1,557 సముద్ర జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం జీవులు ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకుంటున్నాయని తేలింది.  

గజరాజుల పాలిట ప్లాస్టిక్‌ పాశం 
గతేడాది భారత దేశంలోని పెరియార్‌ అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల అడవి ఏనుగు మృతి చెందింది. ప్రతి శీతాకాలంలో శబరిమలకు అడవు­ల ద్వారా కాలినడకన వెళ్లే లక్షలాది మంది భక్తు­లు విచ్చలవిడగా పడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాల­ను తినడంతో పేగుల్లో అంతర్గత రక్తస్రావం, అవ­య­వాలు విఫలమై అది చనిపోయినట్టు శాస్త్రవే­త్తలు గుర్తించారు. ఒక్క ఏనుగులే కాదు అతి శక్తివంతమైన వేటాడే జీవులైన హైనాలు, పులుల­తో పాటు జీబ్రాలు, ఒంటెలు, పశువులతో స­హా భూ ఆధారిత క్షీరదాలు ప్రమాదవశాత్తు ప్లా­స్టిక్‌ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్నాయి.  

భూసారానికి పెనుముప్పు 
ప్లాస్టిక్‌లోని మైక్రో ప్లాస్టిక్స్‌ భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమికి మేలు చేసే మిత్ర పురుగులు, లార్వాలు, అనేక కీటకాల క్షీణతలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్‌ ఫుడ్‌ ప్యాకేజింగ్, ప్లాస్టిక్‌ గొట్టాలు, బయోవ్యర్థాలు హానికరమైన రసాయనాలను మట్టిలోకి విడుదల చేస్తాయి. అవి భూగర్భ జలాల్లోకి ప్రవే­శించి నీటిని సైతం కలుషితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించడం, ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌పై అనేక స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాలు పాస్టిక్‌పై శాశ్వత, పాక్షిక నిషేధాన్ని విధించాయి.

మరిన్ని వార్తలు