Delhi Pollution: ‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం?

11 Nov, 2023 09:52 IST|Sakshi

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దీపావళి మరుసటి రోజు ఉదయం అంటే నవంబర్ 13 నుండి ప్రారంభంకానుంది.

ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) గత కొన్ని రోజులుగా నిరంతరం 450కు పైననే ఉంటూ వస్తోంది. ఏక్యూఐ  201 నుంచి 300 మధ్య ఉంటే గాలి పీల్చుకోవడానికి ‘చెడు’ అయినదిగా పరిగణిస్తారు. ఇది 301-400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’ ఉన్నట్లులెక్క. 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది’గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ‘చాలా తీవ్రమైనది’గా పరిగణిస్తారు. నవంబరు 13-20 తేదీల మధ్య గత ఏడేళ్లుగా ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలుత దీనిని 2016లో ప్రారంభించారు.

సరి-బేసి విధానం అంటే ఏమిటి?
రెండు చేత భాగింపబడని సంఖ్యను బేసిగా పరిగణిస్తారు. ఉదాహరణకు 1, 3, 5….  ఇక సరి (ఈవెన్‌) అంటే రెండు చేత పూర్తిగా భాగింపబడే సంఖ్య. ఉదాహరణకు 2, 4, 6.. ఇవి సరి సంఖ్యలుగా పరిగణిస్తారు. ‘బేసి-సరి’ నియమం ప్రకారం డ్రైవింగ్ చేయడం అంటే.. సరి సంఖ్యగల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ సరి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా బేసి సంఖ్యల తేదీలలో.. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ బేసి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం విషయానికొస్తే.. ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై కార్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలనుకుంటోంది. ఇలా చేయడం వలన వాయు నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తోంది.

గతంలో ప్రభుత్వం దీనిని అమలు చేసినప్పుడు, టాక్సీలు (సీఎన్‌జీతో నడిచేవి), మహిళలు నడిపే కార్లు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, అన్ని ద్విచక్ర వాహనాలతో సహా అనేక వర్గాల వాహనాలకు మినహాయింపు  ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 75 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఈ 75 లక్షల వాహనాల్లో మూడో వంతు కార్లు. బేసి-సరి పథకం అమలయినప్పుడు ప్రతి రోజు దాదాపు 12.5 లక్షల కార్లు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మినహా) ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అవకాశం ఉండదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉంటుంది. అయితే కొన్ని నెలల్లో (ముఖ్యంగా దీపావళి వచ్చే మాసంలో) వాయు కాలుష్యం మరింత తీవ్రంగా మారుతుంది. పంజాబ్, హర్యానాలలో పంట చేతికొచ్చాక గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇది కూడా వాయు కాలుష్యానికి కారణంగా నిలుస్తుంది. అక్కడి నుంచి వచ్చే పొగ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. 

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా, మెక్సికో, ఫ్రాన్స్‌లోని నగరాల్లో సరి-బేసి విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. 2019లో ఢిల్లీలో సరి-బేసి విధానం అమలు చేసినప్పుడు నోయిడా, ఘజియాబాద్‌లలో స్వల్పంగా వాయు కాలుష్యంలో తగ్గుదల కనిపించిందని తేలింది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం వల్ల తీవ్రమైన కాలుష్య స్థాయిలు ఖచ్చితంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమని అంటున్నారు. 2016 జనవరిలో సరి-బేసి విధానాన్ని అమలు చేసినప్పుడు.. ఈ ప్రణాళిక ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమైంది’ అని ఒక అధ్యయనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి?

మరిన్ని వార్తలు