కౌంటింగ్‌కు కౌంటర్‌

5 Nov, 2020 03:36 IST|Sakshi

ప్రజల్ని మోసం చేస్తున్నారు

ఎన్నికలపై సుప్రీంకోర్టుకెళతాం: ట్రంప్‌ స్పష్టీకరణ

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇదో అసాధారణ నిర్ణయం. విమర్శలు, వివాదాలు, క్షణక్షణం ఉత్కంఠ రేగే పరిస్థితుల మధ్య వ్యవహారం కోర్టు వరకు వెళుతోంది. మొదట్నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు కోర్టుకెక్కుతామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌ అమెరికా ప్రజల్ని మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత కూడా పోస్టల్‌ బ్యాలెట్‌కు అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ట్రంప్‌ దీనిపై సుప్రీంకోర్టుకి వెళతానని స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు శ్వేత సౌధంలో తన మద్దతుదారులనుద్దేశించి ట్రంప్‌ మాట్లాడారు.

‘‘ఈ ఎన్నికల్లో మనమే గెలవబోతున్నాం. నా దృష్టిలో మనమే గెలిచాం. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి మనం కట్టుబడి ఉన్నాం. అందుకే చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటాం’’అని ట్రంప్‌ చెప్పారు. ‘‘వెంటనే పోస్టల్‌ బ్యాలెట్‌లను అనుమతించడం ఆపేయాలి. జో బైడెన్‌ శిబిరం దేశాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కి అనుమతిస్తున్నారు. నవంబర్‌ 3 అర్థరాత్రి తర్వాత వచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌లను అనుమతించ కూడదు. అందుకే సుప్రీంకోర్టుకెళతాం’’అని ట్రంప్‌ తన అనుచరుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ట్రంప్‌ మొదట్నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఓట్లలో అక్రమాలకు ఆస్కారం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి సగం మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అన్నింటినీ ఎదుర్కొంటాం: డెమొక్రాట్లు
ఎన్నికల ఫలితాల్ని నిరోధించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తున్నారని డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ శిబిరం విమర్శించింది. ట్రంప్‌ కోర్టుకి వెళ్లకుండా తమ న్యాయ నిపుణుల బృందం అడ్డుకుంటుందని బైడెన్‌ క్యాంపైన్‌ మేనేజర్‌ ఓ మల్లే డిల్లాన్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిలిపివేయాలని ట్రంప్‌ పేర్కొనడం అసాధారణం, అవమానకరమని ఆమె మండిపడ్డారు. ట్రంప్‌ చర్యలు సరైనవి కావన్న డిల్లాన్‌ ఓటింగ్‌ నిలిపివేయాలనడం అమెరికా పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమేనని అన్నారు. ట్రంప్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కోవడానికి తమ న్యాయనిపుణుల బృందం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అలా చెయ్యడం కుదరదు: అమెరికా పోస్టల్‌ సర్వీసు
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓట్లు అన్నింటీనీ మంగళవారం సాయంత్రానికల్లా కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించాలన్న న్యాయస్థానం ఆదేశాలను పాటించలేమని అమెరికా పోస్టల్‌ సర్వీసు స్పష్టం చేసింది. ప్రతీ రాష్ట్రంలోనూ రికార్డు స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రావడం వల్ల సమయం పడుతుందని పోస్టల్‌ సర్వీసు తరఫు లాయర్‌ కోర్టులో తన వాదనలు వినిపించారు. కీలక రాష్ట్రాలుగా భావించే డజనుకి పైగా రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా ఓట్లు ఇంకా ఎన్నికల అధికారులకు అప్పగించవలసి ఉంది.

మరిన్ని వార్తలు