Srilanka PM Resignation: శ్రీలంకలో సంచలనం.. ప్రధాని విక్రమ సింఘే రాజీనామా

9 Jul, 2022 18:59 IST|Sakshi

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. లంక కొత్త ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు రాజపక్సేకు తెలియజేసినట్లు ప్రధాని విక్రమసింఘే తెలిపారు.

దేశంలో ఇంధన సంక్షోభం ఉందని, ఆహార కొరత ఉందని, ప్రపంచ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ దేశానికి రావాల్సి ఉందని ఆయన అన్నారు. దేశ సుస్థిరతను నిర్ధారించడానికి మరొక ప్రభుత్వం వెంటనే బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం. ఐఎంఎఫ్‌తో చర్చల వంటి ఆర్థిక పునరుద్ధరణకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆయన కోరారు.

ఇక, కల్లోల శ్రీలంకకు కొత్త ప్రధానిగా మే 12వ తేదీన రణిల్‌ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. కాగా, లంకకు ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఎంపిక కావడం కొత్తేం కాదు. గతంలో దఫాలుగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. మరోవైపు.. లంకేయుల నిరసనల నేపథ్యంలో లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

మరోవైపు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసకుంటున్నాయి. తాజాగా లంకేయులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఇంటి నుంచి విదేశీ ఓడలో పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆందోళనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

ఇది కూడా చదవండి: లంకలో ఆందోళన.. నిరసనల్లో పాల్గొన్న మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు