పది లక్షల్లో ఒకటి.. కనిపించిన కాసేపటికే దారుణం, మళ్లీ కనిపిస్తుందో లేదో?

23 Sep, 2022 12:52 IST|Sakshi

అరే.. ఏంటిది.. అడవుల్లో నల్ల ఎలుగుబంట్లు లేదంటే గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇదేంటి ధ్రువ ప్రాంతాల్లో సంచరించే తెల్ల ఎలుగుబంటి ఇలా దట్టమైన అడవిలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..! ఎందుకంటే మీరనుకుంటున్నట్లు ఇది పోలార్‌ బేర్‌(ధృవపు ఎలుగుబంటి) కాదు!

ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్ల ‘స్పిరిట్‌ బేర్‌’ ఇది. దీన్నే కీర్‌మోడ్‌ బేర్‌ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని అడవుల్లో కనిపించే ఈ తెల్ల ఎలుగు.. వాస్తవానికి నల్ల ఎలుగుబంటి ఉపజాతికి చెందినది కావడం విశేషం! జన్యు మార్పుల కారణంగా నల్ల ఎలుగులకు ఇలా తెల్ల ఎలుగు పుడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రతి 10 లక్షలసార్లలో కేవలం ఒక్కసారే సంభవించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

అత్యంత అరుదుగా పుట్టే ఈ రకమైన ఎలుగుబంట్లను అడవుల్లో గుర్తించడం దాదాపు అసాధ్యమని అటవీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా మధ్య, ఉత్తర తీర ప్రాంతాల్లో స్పిరిట్‌ బేర్స్‌ జీవిస్తాయని వారు వివరించారు. కానీ అనూహ్యంగా.. 

ఈ తెల్ల ఎలుగుబంటి ఇటీవల అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ ఎగువ ద్వీపకల్ప ప్రాంతంలో కనిపించి యావత్‌ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఓ వేటగాడు అమర్చిన ఎరవైపు వచ్చి అక్కడ అటవీ అధికారులు అమర్చిన ఓ ఆటోమెటిక్‌ మోషన్‌ సెన్సర్‌ కెమెరాకు చిక్కింది. ఈ ఎలుగు ముఖం, మెడ భాగం తప్ప మిగతా శరీరమంతా ధవళవర్ణంలో ఉంది. దీని వయసు సుమారు రెండేళ్లు ఉండొచ్చని, అది మగదని అధికారులు వివరించారు. కానీ, విషాదం ఏంటంటే.. 

కనిపించిన కాసేపటికే అది తోడేళ్ల దాడిలో మృతి చెందిందని అధికారులు చెప్తున్నారు. ఇలాంటిది మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో అనే బెంగ ఇప్పుడు పరిశోధకుల్లో నెలకొంది. ఇది తెల్ల ఎలుగేనని అమెరికా సహజ వనరుల శాఖ ఇంకా నిర్ధారించనప్పటికీ ఓ ట్రెక్కింగ్‌ గైడ్‌ మాత్రం దీన్ని స్పిరిట్‌ బేర్‌గా పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో ఫొటోలు షేర్‌ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు