రష్యా దూకుడు: నేల మీదే కాదు, నింగిలో కూడా.. తగ్గేదేలే!

3 Mar, 2022 20:34 IST|Sakshi

ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం భూమ్మీదే కాదు.. అంతరిక్షంలోనూ ప్రభావం చూపిస్తోంది. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై ప్రతీకారానికి దిగిన రష్యా.. వన్‌వెబ్ శాటిలైట్‌ ప్రాజెక్ట్‌ను అర్థాంతరంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అసలేంటీ ప్రాజెక్ట్‌..? రష్యా చర్యతో ఎవరికి నష్టం..?. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వన్‌వెబ్ సంస్థను కష్టాల్లోకి నెట్టింది. ఇంటర్నెట్ ప్రసార ఉపగ్రహాల ప్రయోగాన్ని రష్యా నిలిపివేసింది. రష్యా నిర్మించిన సోయజ్ రాకెట్ ద్వారా శుక్రవారం 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాల్సి ఉంది. కజకిస్థాన్‌లో రష్యాకు చెందిన బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ ప్రయోగం జరగాలి. అయితే తమ దేశంపై బ్రిటన్ విధించిన ఆంక్షలకు ప్రతిగా.. వన్‌బెబ్ ఉపగ్రహాల ప్రయోగానికి నిరాకరిస్తామని రష్యా స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ ప్రకటించారు.

ఉపగ్రహాల నుంచి నేరుగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించినదే వన్‌వెబ్ ప్రాజెక్ట్‌. ఇందుకోసం తొలి దశలో 150 కిలోల బరువున్న 648 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 428 ఉపగ్రహాలు కక్ష్యను చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది.  ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేరుస్తోంది. ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు రష్యా అడ్డుపుల్ల వేసింది. లండన్ కేంద్రంగా పనిచేసే వన్‌వెబ్‌ కంపెనీలో.. భారత్‌కు చెందిన భారతీ ఎంటర్‌ప్రైజెస్ 42.2శాతం వాటా కొనుగోలు చేసింది. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సహకారం ఉపసంహరించుకొంటామని ఇప్పటికే రష్యా బెదిరింపులకు దిగింది. ఐఎస్ఎస్ నిర్వహణలో రష్యా తమ సహకారాన్ని ఉపసంహరించుకుంటే.. యూఎస్, ఇతర దేశాలు దానిని నియంత్రించలేవని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఉపగ్రహ ప్రయోగాలకూ మోకాలడ్డుతోంది. అంతేకాదు వన్‌వెబ్ రాకెట్‌పై నుంచి అమెరికా, బ్రిటన్‌, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. భారత జాతీయ జెండాను మాత్రమే రాకెట్‌పై ఉంచింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు