నాచు.. భయపెడుతోంది!

8 Aug, 2022 05:13 IST|Sakshi
సెయింట్‌ కిట్స్‌ తీరం వెంబడి పేరుకుపోయిన నాచు

కరీబియన్‌ తీర ప్రాంతాల్లో 24.2 మిలియన్‌ టన్నులు

దెబ్బతింటున్న పర్యాటకం.. ఉపాధి కోల్పోతున్న స్థానికులు

జీవజాలం, పర్యావరణానికి ముప్పు

కరీబియన్‌ దీవులు.. ప్రకృతి అందాలకు మారుపేరు. భువిలో స్వర్గంగా పేరుగాంచాయి. అలాంటి కరీబియన్‌ తీర ప్రాంతాలను ఇప్పుడు సముద్రపు నాచు తీవ్రంగా కలవరపెడుతోంది. సర్గాసమ్‌ అనే రకం నాచు విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ఏడాది జూన్‌ నాటికి కరీబియన్‌ సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో, సెంట్రల్‌ వెస్ట్, ఈస్ట్‌ అట్లాంటిక్‌లో 24.2 మిలియన్‌ టన్నుల నాచు పేరుకుపోయినట్లు అంచనా. ప్రమాదకరమైన ఈ నాచు జీవజాలానికి, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది. తీర ప్రాంతాల నుంచి విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. అంతేకాదు పర్యాటకం సైతం దెబ్బతింటోంది. పర్యాటకుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
కరీబియన్‌ తీరంలోని నాచును పక్కపక్కనే పేరిస్తే అది ఫ్లోరిడా గల్ఫ్‌ తీరంలోని టాంపా బే వైశాల్యం కంటే ఆరు రెట్లు అధికంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడాకు చెందిన పరిశోధకుడు చువాన్మిన్‌ హూ చెప్పారు. ఒకప్పుడు జనంతో కళకళలాడిన బీచ్‌లు నాచు కారణంగా వెలవెలబోతున్నాయని, అక్కడ వ్యాపారాలు దారుణంగా పడిపోతున్నాయని యూఎస్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ గవర్నర్‌ ఆల్బర్ట్‌ బ్రియాన్‌ చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని వాపోయారు. కరీబియన్‌ బీచ్‌లను నాచురహితంగా మార్చాలని, ఇందుకు సమయం పడుతుందన్నారు.

మెక్సికోలో 18 బీచ్‌ల్లో నాచు తిష్ట
సముద్ర ఉపరితలంపై నాచు దట్టంగా పేరుకుపోతుండడంతో నౌకలు, పడవల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. చేపల వేట సైతం ఆగిపోతోంది. సర్గాసమ్‌ నాచు వల్ల అట్లాంటిక్‌ సముద్ర తీర ప్రాంతాల్లో ముక్కుపుటలు అదిరిపోయే దుర్గంధం వెలువడుతుండడంతో అటువైపు వెళ్లేందుకు సాధారణ జనంతోపాటు మత్స్యకారులు కూడా జంకుతున్నారు. ఈ వాసనను పీలిస్తే తల తిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, గుండె కొట్టుకోవడంలో హెచ్చతగ్గులు వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాచు నిర్జీవమైపోయిన తర్వాత సముద్రంలో అడుగు భాగానికి చేరుకుంటుంది. దీనివల్ల విలువైన పగడపు దిబ్బలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

మెక్సికోలో 18 బీచ్‌లు నాచుతో నిండిపోయినట్లు గుర్తించారు. గత నెలలో యూఎస్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారంటే నాచు ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్గాసమ్‌ నాచు ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం ఏమిటంటే.. బలంగా వీస్తున్న ఈదురు గాలులు, సముద్రపు అలల ఉధృతి. దక్షిణ అట్లాంటిక్‌ వాతావరణం నాచు పెరుగుదలకు అనుకూలంగా ఉందని అంటున్నారు. నాచు వల్ల కేవలం నష్టాలే కాదు, లాభాలూ ఉన్నాయి. పీతలు, డాల్ఫిన్లు, సీల్స్, చేపలు వంటి సముద్ర జీవులకు ఇది ఆహారంగా ఉపయోగడుతోంది. సంక్షోభంలోనూ అవకాశం అంటే ఇదే. నాచును సేకరించి, ఎరువు తయారు చేయొచ్చు. కొన్ని దేశాల్లో నాచును సలాడ్ల తయారీకి ఉపగియోస్తారు.    
                                 
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

మరిన్ని వార్తలు