‘దెయ్యం’ పట్టింది; దెబ్బలు తాళలేక నిజం చెప్పింది!

19 Oct, 2020 18:04 IST|Sakshi

దెబ్బకు ‘దెయ్యం’ వదిలింది!

మొగాదిషు: హోం వర్క్‌ చేయనపుడు, పరీక్షలకు సరిగా ప్రిపేర్‌ కానప్పుడు.. స్కూలు ఎగ్గొట్టేందుకు అల్లరి పిడుగులు చెప్పే కారణాలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. కడుపు నొప్పి, కాలు నొప్పి అంటూ వాళ్లు చేసే అభినయం, హావభావాలు ముచ్చటగొలుపుతాయి. కానీ అల్లరి శ్రుతిమించి, బడికి ఎగనామం పెట్టే ప్లాన్లు బెడిసి కొడితే మాత్రం వీపు విమానం మోత మోగుతుంది. సోమాలియాకు చెందిన ఓ పాఠశాల విద్యార్థినికి ఇలాంటి చేదు అనుభమే ఎదురైంది. పరీక్ష రాయకుండా తప్పించుకుందామని ప్లాన్‌ చేస్తే, శరీరమంతా వాతలు తేలేలా దెబ్బలు తినాల్సి వచ్చింది.

వివరాలు.. ఖతీజా అనే బాలిక రోజూలాగే స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే వెంటనే ఆరోజు నిర్వహించనున్న పరీక్ష, పెండింగ్‌లో ఉన్న హోంవర్క్‌ విషయం గుర్తుకువచ్చి ఎలాగైనా దాని నుంచి తప్పించుకోవాలనుకుంది. ఇంట్లో తన పాచికలు పారకపోవడంతో స్కూళ్లోనే తన ప్లాన్‌ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో స్నేహితులు ఇచ్చిన సలహాతో దెయ్యం పట్టినట్లు నటిస్తూ బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టింది. పరీక్ష ప్రారంభం కాగానే డెస్క్‌ను కొడుతూ గిబ్బరిష్‌ భాషలో మాట్లాడుతూ.. ‘‘దేవుడు అనే వాడు లేనేలేడు. సైతానే నా తండ్రి’’ అంటూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన టీచర్లు స్కూలు ప్రార్థనాస్థలం వద్దకు తీసుకువెళ్లి, ‘దెయ్యం’ వదిలించే ప్రక్రియ కోసం ముగ్గురు వ్యక్తులను పిలిపించారు. (అసలు ఇదంతా ఏంటి: కొత్తజంటపై ట్రోలింగ్‌)

ఇక వచ్చీరాగానే రంగంలోకి దిగిన సదరు పురుషులు, ‘‘ఈ అమాయకురాలిని ఎందుకు పట్టిపీడిస్తున్నావు’’అంటూ కర్రలతో ఆమెను కొట్టసాగారు. తొలుత కాస్త గట్టిగానే నిలబడిన ఖతీజా, దెబ్బల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతుండటంతో.. తనకేమీ దెయ్యం పట్టలేదని, తనను వదిలేయాలంటూ బతిమిలాడటం మొదలుపెట్టింది. కానీ వాళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. సైతాన్‌ ఎప్పుడూ ఇలాగే మాట్లాడిస్తాడని, దెయ్యాన్ని వదిలించేదాకా పట్టువీడమంటూ మరింతగా కొట్టసాగారు. దీంతో ఆ బాలిక అసలు విషయం బయటకు పెట్టక తప్పలేదు. అయినప్పటికీ వాళ్లు ఆమెను నమ్మలేదు. దీంతో ఖురాన్‌లోని పంక్తులు చదువుతూ, పరీక్ష తప్పించుకునేందుకే ఇలా చేశానని నిజం ఒప్పుకొంది. ఈ విషయాన్ని ఓ టిక్‌టాక్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది.   

మరిన్ని వార్తలు