ల్యాబ్‌లోని మెదడు కణాలూ వీడియోగేమ్‌ ఆడేశాయ్‌

13 Oct, 2022 04:20 IST|Sakshi

సిడ్నీ: మానవ మేథోశక్తిని ప్రయోగశాలలో పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు ఆ క్రతువులో స్వల్ప విజయం సాధించారు. 1970ల నాటి టెన్నిస్‌ క్రీడను తలపించే పోంగ్‌ కంప్యూటర్‌ వీడియోగేమ్‌ను ప్రయోగశాలలో అభివృద్ధిచేసిన మెదడు కణాలు అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొత్త తరం బయోలాజికల్‌ కంప్యూటర్‌ చిప్స్‌ అభివృద్ధి కోసం ఆస్ట్రేలియాలోని కార్టికల్‌ ల్యాబ్స్‌ అంకురసంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులోని న్యూరో శాస్త్రవేత్తల బృందం మానవ, ఎదగని ఎలుక నుంచి మొత్తంగా దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్‌లో పెంచుతోంది.

డిష్‌బ్రెయిన్‌గా పిలుచుకునే ఈ మెదడు కణాల సముదాయం ఎలక్ట్రోడ్‌ వరసలపై ఉంచినపుడు పోంగ్‌ వీడియోగేమ్‌కు తగ్గట్లు స్పందించిందని పరిశోధనలో భాగస్వామి అయిన డాక్టర్‌ బ్రెడ్‌ కగాన్‌ చెప్పారు. ఈ తరహా ప్రయోగం కృత్రిమ జీవమేథో ప్రయోగాల్లో మొదటిది కావడం గమనార్హం. మూర్ఛ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం సమస్యలను మరింతగా అర్ధంచేసుకునేందుకు, భవిష్యత్‌లో కృత్రిమంగా ప్రయోగశాలలోనే జీవమేథ రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. తదుపరి పరీక్షలో తాము మత్తునిచ్చే ఇథనాల్‌ను వాడి కణాల పనితీరు.. మద్యం తాగిన మనిషి ‘పనితీరు’లా ఉందో లేదో సరిచూస్తామన్నారు. ఈ పరిశోధన వివరాలు న్యూరాన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

మరిన్ని వార్తలు