వ్యాక్సిన్‌ కోసం నాపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి: పూనావాలా

2 May, 2021 01:34 IST|Sakshi

కొందరు ప్రముఖులు దురుసుగా మాట్లాడుతున్నారు 

ఒత్తిళ్ల కారణంగానే లండన్‌లో ఉంటున్నా

లండన్‌: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విశ్వరూపం చూపుతున్న సమయంలో వ్యాక్సిన్‌ కోసం నెలకొన్న విపరీతమైన డిమాండ్‌పై కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్‌ పూనావాలా స్పందించారు. తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, దేశంలోని కొందరు అత్యంత బలవంతులైన ప్రముఖులు కోవిషీల్డ్‌ సరఫరా కోసం డిమాండ్‌ చేస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని పూనావాలా ‘ది టైమ్స్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. అందుకే భార్యా పిల్లలతో కలిసి ఉండటానికి లండన్‌కు వచ్చేశానని, దీనికి ఒత్తిళ్లే ముఖ్యకారణమని ఆయన చెప్పారు.

‘అనుకున్న దానికంటే ఎక్కువ సమయం లండన్‌లో ఉండటానికి కారణం అదే. మళ్లీ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. భారమంతా నా ఒక్కడి భుజస్కందాలపైనే పడుతోంది. కానీ నేనొక్కడినే చేయలేను. మీ బాధ్యత మీరు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నపుడు కూడా... ఎవరో ఎక్స్, వై, జడ్‌ అడిగినంత సరఫరా చేయలేకపోయినందుకు వారేం చేస్తారోననే ఆలోచనలతో గడపలేం కదా. అలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి నేను సిద్ధంగా లేను. ఇంతటి దూకుడు వ్యవహారశైలి (దురుసుతనం)ని, మానుంచి ఇంతగా ఆశించడాన్ని  నేనెప్పుడూ చూడలేదు. మాకు వ్యాక్సిన్‌ అందాల్సిందేనని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. తమకంటే ముందు ఇతరులకు వ్యాక్సిన్లు అందడాన్ని వారు అర్థం చేసుకోలేరు’ అని పూనావాలా అన్నారు. సీరమ్‌ సంస్థ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఇటీవలే పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించిన విషయం తెలిసిందే.  చదవండి: (భారత్‌లో కరోనా పరిస్థితి విషాదకరం)

భారత్‌కు బయట కూడా కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయని, లండన్‌లో మకాం పెట్టడానికి ఇది కూడా ఒక కారణమని పూనావాలా సంకేతాలిచ్చారు. బ్రిటన్‌తో సహా ఇతరదేశాల్లో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి సంబంధించిన రాబోయే కొద్దిరోజుల్లో ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. భారత్‌లో పరిస్థితి ఇంతగా విషమిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారన్నారు. కోవిషీల్డ్‌ డోసు ధరను రాష్ట్రాలకు రూ.300, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లుగా నిర్ణయించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లోనూ లాభాలు మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన విమర్శలపై పూనావాలా స్పందిస్తూ... ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరకు లభిస్తున్న వ్యాక్సిన్‌ తమదేనని అన్నారు. తామేమీ తప్పు చేయడం లేదని, దీనిపై కాలం చెప్పే తీర్పు కోసం వేచిచూస్తానని అన్నారు.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు