వీడియో: భారీగా ఊగిపోయిన విమానం.. ప్రయాణికుల ముక్కులు, మూతులు పగిలాయ్‌!

22 Oct, 2022 13:53 IST|Sakshi
విమానంలో చెల్లాచెదురైన దృశ్యాలు.. పక్కన గాయపడ్డ యువతి

బ్యూనస్‌ ఎయిర్స్‌: ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం ఆకాశంలో ఉండగా.. తీవ్ర కుదుపునకు లోనైంది. ఆ దెబ్బకు ప్రయాణికులు విమానంలో చెల్లాచెదురై గాయపడ్డారు. కొందరు ప్రయాణికులకు ముక్కులు, మూతులు పగిలినట్లు సమాచారం. అట్లాంటిక్‌ మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు వణికిపోయనట్లు తెలుస్తోంది.

అర్జెంటీనాకు చెందిన ఎయిరోలినియస్‌ అర్జెంటీనాస్‌ A330 విమానం  భారీ కుదుపునకు లోనైంది. మాడ్రిడ్‌ నుంచి బ్యూనస్‌ ఎయిర్స్‌ వెళ్లాల్సిన విమానం అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్‌ 18న ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

సెక్యూరిటీ బెల్ట్‌ ధరించాలని సిబ్బంది మమ్మల్ని అప్రమత్తం చేయలేదు. విమానం ఒక్కసారిగా ఊగిపోవడం మొదలైంది. చాలాసేపు అది కుదిపేసింది. దీంతో ఒక్కసారిగా అంతా చెల్లాచెదురై పడిపోయాం అని ఓ ప్రయాణికుడు వెల్లడించారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది సైతం ఇబ్బంది పడ్డారని మరో ప్రయాణికుడు వెల్లడించాడు. 

ఆ ఘటన తర్వాత ఏడు గంటలపాటు భయం భయంగా  ప్రయాణికులు గడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత బ్యూనస్‌ ఎయిర్స్‌లోని ఎజయిజా విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన విమానం నుంచి గాయపడిన వాళ్లకు చికిత్స అందించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వాళ్ల పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిర్‌లైన్స్‌ నిర్వాహకులు వెల్లడించారు. మరికొందరికి స్వల్పగాయాలు అయినట్లు తెలిపింది. 

అయితే సిబ్బంది మాత్రం కుదుపులను పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేశామని చెబుతోంది. ఘటన జరిగిన సమయంలో 271 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. విమానంలో చెల్లాచెదురైన విమానం ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.


Video Credits: New York Post 

మరిన్ని వార్తలు