సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?

21 Jun, 2021 18:41 IST|Sakshi
వీడియో దృశ్యం

ఇస్తాంబుల్‌ : బద్ధకంతో పని తగ్గించుకోవటానికి లేదా తప్పించుకోవటానికి మనం చేసే పనులు ఒక్కోసారి ఇతరుల ప్రాణాల మీదకు తెస్తాయి. అవతలి వ్యక్తులకు భూమ్మీద నూకలుంటే బ్రతికి బయటపడతారు.. లేకపోతే చచ్చి ఊరుకుంటారు. టర్కీకి చెందిన ఓ వ్యక్తి చేసిన బద్ధకపు పనికి పొరుగింటి అమ్మాయి ప్రాణాలు పోయేవే.. భూమ్మీద నూకలుండబట్టి బతికి బయటపడింది.  వివరాల్లోకి వెళితే.. టర్కీలోని ఉస్కుదార్‌ జిల్లాకు చెందిన మీసట్‌ దురాన్‌ కొద్దిరోజుల క్రితం కొత్త సోఫా కొనుక్కున్నాడు. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న పాత సోఫా బయట పడేయటానికి నిశ్చయించుకున్నాడు. అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ మూడో అంతస్తులో ఉంటున్న అతడు దాన్ని మెట్లగుండా తీసుకుపోవటానికి బద్ధకించాడు. రియర్‌ విండోలోంచి దాన్ని కిందకు తోసేశాడు. అయితే, అదే సమయంలో మీసట్‌ దురాన్‌ పొరిగింటి అమ్మాయి కింద రోడ్డు మీదకు వస్తోంది. బిల్డింగ్‌లోంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె పక్కన ‘ఢాం’ అంటూ సోఫా పడింది. ఆమె కొంచెం పక్కకు జరిగిఉంటే ప్రాణాలు పోయేవి.

వీడియో దృశ్యం

దీనిపై మీసట్‌ దురాన్‌ మాట్లాడుతూ.. ‘‘ నేను కొత్త సోఫా కొన్నాను. కిటిలోంచి కిందకు చూసినపుడు అక్కడ ఎవరూ లేరు. అంతా ఓకే అనుకున్నాకే కిటికీలోంచి సోఫాను పడేశాను. అప్పుడే మా పొరిగింటి అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె చాలా లక్కీగా తప్పించుకుంది. లేకపోతే చనిపోయి ఉండేది. నేను హంతకుడ్ని అయ్యేవాడిని’’ అని అన్నాడు. సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిన ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై.. ‘‘ సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?’’.. ‘‘ ఇలాంటి వెధవలు ప్రతీ దేశంలో ఉంటారు’’...‘‘ ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు, పోలీసులకు అప్పగించాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు