రష్యా సైనికుల పైశాచికం.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

26 Apr, 2022 15:19 IST|Sakshi

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా యుద్ధానికి తెరపడే సూచనలు మాత్రం కనిపించట్లేదు. ఉక్రెయిన్‌పై రష్యా తగ్గేదేలే అంటూ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా బలగాలకు ప్రతిదాడులతో గట్టిగా సమాధానం చెబుతోంది.  

అయితే సైనిక చర్య పేరుతో రష్యా జరుపుతున్న పైశాచిక దాడిలో వేలాది మంది సైనికులు, పౌరులు, బలవుతున్నారు. వీరిలో అమాయక మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీవ్‌ నగరంలో రష్యా బలగాలు కాల్చి చంపిన మహిళల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యా బలగాలు ఉక్రెయిన్ మహిళలను చంపడానికి ముందు వారిలో కొంతమందిపై అత్యాచారానికి పాల్పడినట్టు వైద్యులు వెల్లడించారు.
చదవండి: ఇక అసలు యుద్ధం.. రష్యా తీవ్ర హెచ్చరికలు

స్త్రీలను కాల్చి చంపే ముందు కొంతమందిపై అత్యాచారం చేశారనే కేసులు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని ఉక్రెయిన్‌ ఫోరెన్సిక్ వైద్యుడు వ్లాడిస్లావ్ పెరోవ్స్కీ తెలిపారు. తమ బృందంతో కలిసి 12 మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.అత్యాచార కేసులు చాలా సున్నితమైనవని, దీనిపై మరింత డేటాను సేకరిస్తున్నందున పూర్తి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. తమ వద్ద పరీక్షించేందుకు ఇంకా వందలాది మృతదేహాలు ఉన్నాయన్నారు.

>
మరిన్ని వార్తలు