దివాళా తీశాం.. విదేశీ రుణాలు తీర్చలేం: లంక ఆర్థిక శాఖ

12 Apr, 2022 14:16 IST|Sakshi

ఊహించిన స్థాయిలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. దేశం దాదాపుగా దివాళా తీసిందని సూత్రప్రాయంగా సంకేతాలు పంపింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టే పరిస్థితి ఎదురయ్యిందని మంగళవారం ఆ దేశ ఆర్థిక శాఖ ఒక ప్రకటన లో పేర్కొంది. 

తీసుకున్న అప్పులను సమయంలోగా చెల్లించలేని స్థితిలో ఉన్నాం(డిఫాల్ట్‌). సుమారు 51 బిలియన్‌ డాలర్ల అప్పులను కట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టం చేసింది శ్రీ లంక ఆర్థిక శాఖ. ప్రస్తుతం అప్పు చెల్లింపులు తమకు పెద్ద తలనొప్పిగా మారాయని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అన్నారు. ఇప్పుడు అప్పులు కట్టడం అసాధ్యం కూడా అని తేల్చి చెప్పారు.

కారణం.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. కాబట్టే, అప్పులను కట్టలేమని లంక పేర్కొంది. అలాగే తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే.. దేశంలోనే వేరే ఇతర మార్గాలనుంచైనా వసూలు చేసుకోవచ్చని, లేదంటే.. శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది. 

ట్విస్ట్‌.. అయితే అప్పుల ఎగవేతపై శ్రీలంక ఆర్థిక శాఖ కాసేపటికే మరో ప్రకటన చేసింది. అప్పులు చెల్లించడాన్ని తాత్కాలికంగా మాత్రమే రద్దు చేసుకున్నామని సెంట్రల్ బ్యాంక్ అధికారులు అంటున్నారు. మార్చి చివరినాటికి కేవలం $1.9 బిలియన్ల నిల్వలు ఉండగా, ఈ సంవత్సరం తన రుణ భారాన్ని తీర్చుకోవడానికి శ్రీలంకకు $7 బిలియన్లు అవసరమని అంచనాలు ఉన్నాయి.

కడితే.. పెను సంక్షోభమే! ఇప్పుడున్న మిగులు విదేశీ నిధులతో.. అప్పులు గనుక కడితే తిండి గింజలు, నిత్యావసరాల దిగుమతులపై పెను ప్రభావం పడే ముప్పుందని అంటున్నారు అక్కడి ఆర్థిక నిపుణులు. ఈ నేపథ్యంలోనే అప్పుల చెల్లింపును తాత్కాలికంగా రద్దు చేసి ఆ డాలర్లను దిగుమతులకు చెల్లిస్తామని అంటున్నారు. 1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అత్యంత బాధాకరమైన తిరోగమనంలో పయనిస్తోంది. దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలకు సుదీర్ఘమైన విద్యుత్ కోతలతో పాటు తీవ్రమైన ఆహారం, ఇంధన కొరతలు విస్తృతమైన బాధలను తెచ్చిపెట్టాయి.

సంబంధిత వార్త: తీవ్ర సంక్షోభానికి అసలు కారణం చెప్పిన లంక ప్రధాని

మరిన్ని వార్తలు