తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!

7 Sep, 2021 06:02 IST|Sakshi

మజర్‌–ఏ–షరీఫ్‌ నుంచి దోహాకు వెళ్లాల్సిన విమానాలు నిలిపివేత

బందీలుగా వందలాది మంది ప్రయాణికులు!

తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్‌ నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, విదేశాలకు వెళ్తున్న వారిని తాలిబన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్‌–ఏ–షరీఫ్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్‌ విమానాలను తాలిబన్లు కొన్ని రోజులుగా నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్‌ మెక్‌కౌల్‌ చెప్పారు. అయితే, నాలుగు విమానాలను తాలిబన్లు ఎందుకు కదలనివ్వడం లేదన్నది ఇంకా తెలియరాలేదు.

మజర్‌–ఏ–షరీఫ్‌ ఎయిర్‌పోర్టు వద్ద అఫ్గాన్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా అఫ్గాన్‌ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్‌పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు. అమెరికా వాదన మరోలా ఉంది. ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్‌ నాయకుడు  మైఖేల్‌ మెక్‌కౌల్‌ స్పష్టం చేశారు. వారు విమానాల్లోనే కూర్చొని, తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి డిమాండ్లు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారని ఆరోపించారు. డబ్బు లేదా తాలిబన్‌ కొత్త ప్రభుత్వానికి చట్టబద్ధత అనేవే ఈ డిమాండ్లు కావొచ్చని చెప్పారు. సమస్యను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. నిజానికి ప్రయాణికులెవరూ తాలిబన్ల వద్ద బందీలుగా లేరని స్థానికులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు