మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య

10 Jul, 2022 05:07 IST|Sakshi
అహ్మదాబాద్‌లో షింజోకు నివాళి

తొలుత మతాధికారిని లక్ష్యంగా చేసుకున్న హంతకుడు

మత సంస్థకు మద్దతిస్తున్నాడని షింజోపై పగ

టోక్యో: జపాన్‌ మాజీ ప్రధానమంత్రి షింజో అబెను పొట్టనపెట్టుకున్న హంతకుడు తెత్సుయా యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడేనట! సదరు నాయకుడిని అంతం చేయాలని ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడట! చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్లింది. ఆ మత సంస్థకు మద్దతు ఇవ్వడమే షింజో చేసిన నేరమయ్యింది.

ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్‌ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజో అబెకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు.

యమగామీకి తొలుత టార్గెట్‌గా మారిన మత సంస్థ, మతాధికారి ఎవరన్నది బయటపెట్టలేదు. శుక్రవారం నరా సిటీలో కాల్పుల్లో షింజో మరణించిన సంగతి తెలిసందే. ఘటనా స్థలంలో హంతకుడు యమగామీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, అబె రాజకీయ వైఖరిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పోలీసుల విచారణలో యమగామీ చెప్పినట్లు సమాచారం.  

అలసిపోయా.. రాజీనామా చేస్తా  
ఉద్యోగం, ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తర్వాత చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. 2005లో జపాన్‌ నావికాదళంలో మారీటైమ్‌ సెల్ఫ్‌–డిఫెన్స్‌ ఆఫీసర్‌గా పనిచేశాడు. హిరోషిమాలోని కురే బేస్‌లో సేవలందించాడు. మూడేళ్లు పనిచేసి, సైన్యం నుంచి తప్పుకున్నాడు.

2020లో కాన్సాయ్‌లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మే నెలలో రాజీనామా సమర్పించాడు. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్‌ ఇయర్‌బుక్‌లో రాశాడు.   

జపాన్‌ ప్రజల కన్నీటి నివాళులు  
షింజో అబె పార్థివ దేహాన్ని శుక్రవారం రాజధాని టోక్యోలో షిబువా ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా షింజో భార్య అఖీ కూడా ఉన్నారు. వేలాది మంది జనం బారులుతీరి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ శనివారం జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సంతాపం సందేశం పంపించారు. చైనా–జపాన్‌ సంబంధాలను మెరుగుపర్చేందుకు షింజో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సంబంధాలను బలోపేతం చేసుకొనేవిషయంలో తాను, షింజో ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చామని గుర్తుచేశారు.

మోదీ, బైడెన్, ఆంథోనీ ఉమ్మడి ప్రకటన  
షింజో అబె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌ శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం అత్యంత అరుదు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌ ప్రాంతం, చతుర్భుజ కూటమి(క్వాడ్‌) ఏర్పాటు వెనుక షింజో కృషిని గుర్తుచేసుకున్నారు. షింజో హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన గౌరవార్థం శాంతియుత, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్‌ కోసం రెట్టింపు కృషి సాగిద్దామని నేతలు ప్రతినబూనారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వాములుగా ‘క్వాడ్‌’ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు