Earthquake: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు..

6 Feb, 2023 21:27 IST|Sakshi

టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భూకంపం ముందు ఓ వ్యక్తి తీసిన లైవ్ వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ముందుగా మెరుపులు వచ్చి ఆ తర్వాత ప్రకంపనలు రావడంతో విద్యుత్ సరఫరా స్తంభించిపోయి అంతా చీకటిమయం అయింది.  ఆ తర్వాత క్షణాల్లోనే భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

రెండో భూకంపం..
అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. మొదటిసారి భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8గా నమోదు కాగా.. రెండోసారి భూకంపం వచ్చినప్పుడు తీవ్రత 7.6గా నమోదైంది.

1700మందికిపైగా మృతి..
టర్కీ చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా చెబుతున్న ఈ భూకంపంలో ఇప్పటివరకు 1498 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. శిథిలాలు తవ్వేకొద్ది మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. అటు సిరియాలో 430 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సిరియా ప్రభుత్వ నియంత్రణలో లేని ప్రాంతాల్లో 380 మంది చనిపోయారు. మొత్తంగా 2300 మందిపైగా మృత్యుఒడికి చేరారు.

ఈ వీడియోల్లో కన్పిస్తున్న దృశ్యాల్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు కళ్లుముందే పేకమేడల్లా కూలిపోవడం హృదయాలను కలచివేస్తోంది.  వందల మంది చనిపోయారు. వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. తమను కాపాడమని ఆర్తనాదాలు పెడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీస్తున్నారు.

భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కన్పిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు.


టర్కీలో 2,818 భవనాలు నేలమట్టం..
1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా టర్కీకి ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది.


చదవండి: అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. వెయిటింగ్ అక్కర్లే 14 రోజుల్లోనే వీసా!

మరిన్ని వార్తలు