India Europe Corridor: భారత్‌- యూరప్‌ కారిడార్‌తో టర్కీకి ఇబ్బంది ఏమిటి?

11 Oct, 2023 07:36 IST|Sakshi

ఆమధ్య రాజధాని ఢిల్లీలో జరిగిన జీ-20 సమావేశంలో ఇతర అంశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్ణయం భారత్ మిడిల్‌ ఈస్ట్‌ మీదుగా యూరప్‌కు చేరుకునేలా కొత్త కారిడార్‌ను నిర్మించడం. అమెరికా భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ కారిడార్‌లో సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి దేశాల సహకారం  చేరింది. 

ఈ కారిడార్ గేమ్ ఛేంజర్‌గా, చైనా దూకుడు చూపుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే బీఆర్‌ఐకి భారత్‌, అమెరికాల పదునైన సమాధానం అని నిపుణులు అంటున్నారు. అయితే చైనా కంటే ముందు టర్కీ ఈ కారిడార్ విషయంలో టెన్షన్‌ పడుతోంది. దీంతో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటే ఐఎంఈసీని ఫ్లాప్ చేయడానికి ప్రత్యేక కారిడార్‌ను నిర్మించాలని యోచిస్తోంది. 

యూఎస్‌ నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో టర్కీ సభ్యదేశంగా ఉన్నప్పటికీ, ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో అమెరికాకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. దీనికి కారణం టక్కీ ఇస్లామిక్‌ దేశం అయినందున దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ పాకిస్తాన్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు.

కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా
వాస్తవానికి ఐఎంఈసీ అనేది భారతదేశం నుండి ఐరోపాకు వస్తువులను రవాణా చేయడానికి మరొక మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్ట్. భారతదేశం, యుఎఇ, సౌదీ అరేబియా, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, జోర్డాన్ వంటి దేశాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమయ్యాయి. ఈ కారిడార్ ద్వారా భారతదేశం నుండి జర్మనీకి కార్గో రవాణాలో 40 శాతం సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం భారత సరుకులు షిప్పింగ్ కోసం జర్మనీ చేరుకోవడానికి 36 రోజుల సమయం పడుతుండగా, ఈ కారిడార్ నిర్మాణం తర్వాత ఈ దూరం 22 రోజుల్లో ఈ తతంగం పూర్తి కానుంది.

ఇరాక్ మీదుగా కారిడార్‌ నిర్మించాలని..
ఈ కారిడార్ ఒక మెగా ప్రాజెక్ట్. దీనిలో గల్ఫ్ దేశాలలో రైల్వేల నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారతదేశ ప్రాముఖ్యతను పెంచే ఈ ప్రాజెక్ట్‌తో టర్కీకి సమస్య ఏమిటనే విషయానికి వస్తే టర్కీ భౌగోళిక స్వరూపం యూరప్, పశ్చిమ ఆసియా మధ్య ఉంది. ఈ ప్రాజెక్ట్ సిద్ధమైతే మధ్యధరా సముద్ర ప్రాంతంలో టర్కీ ప్రాముఖ్యత తగ్గుతుంది. టర్కీ ఇంతకాలం తాను ఈ ప్రాంతానికి అలెగ్జాండర్‌గా పరిగణించుకుంటూ వచ్చింది. ఈ ప్రాంతంలోని గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో టర్కీకి శత్రు సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు పోటీగా, ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కొత్త కారిడార్‌ను నిర్మించాలనుకుంటున్నాడు. అయితే ఇది అంత సులభం కాదు. ఇరాక్ మీదుగా 1,200 కి.మీ కారిడార్‌ను నిర్మించాలని టర్కీ యోచిస్తోంది. ఇందులో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌, రోడ్డు నిర్మాణం ఉండనున్నాయి. దీనికి దాదాపు 17 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది.

టర్కీ యోచనకు అనేక అడ్డంకులు 
అయితే భారత్‌ను యూరప్‌కు అనుసంధానించే కారిడార్‌ ప్రాజెక్టుకు పోటీగా ప్రాజెక్టును సిద్ధం చేయాలన్న టర్కీ యోచనలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో టర్కీ తన మిత్రదేశం చైనాతో జతకట్టి ఐఎంఈసీ కారిడార్‌ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. కాగా ఈ విషయంలో చైనా ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు. ఇప్పటికే మిడిల్‌ ఈస్ట్‌లో ఆర్బీఐ ప్రాజెక్ట్‌ చేపట్టిన చైనా.. భవిష్యత్తులో టర్కీతో చేతులు కలిపి, ఐఎంఈసీ కారిడార్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. 
ఇది కూడా చదవండి: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు?

మరిన్ని వార్తలు