పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే: ఐక్యరాజ్యసమితి

7 Dec, 2022 10:16 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: పని ప్రదేశాల్లో దిగువస్థాయి సిబ్బందికిపై హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారాయని ఓ సర్వేలో తేలింది. యువత, వలసదారులు, రోజువారీ వేతన జీవులు, ముఖ్యంగా మహిళలే ఇందుకు బాధితులుగా మారుతున్నారని వెల్లడైంది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన మొట్టమొదటి సర్వే ఇది. ఐరాస అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో), లాయిడ్స్‌ రిజిస్టర్‌ ఫౌండేషన్, గాల్లప్‌ సంస్థ కలిసి గత ఏడాది చేపట్టిన ఈ సర్వే ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల్లోని 75 వేల మంది సిబ్బందిపై సర్వే జరపగా 22% మందికి పైగా ఏదో ఒక రకమైన వేధింపులు, హింసకు గురవుతున్నట్లు తెలిపారని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు పని ప్రదేశంలో ఏదో ఒకవిధమైన వేధింపులకు గురవుతున్నట్లు తెలపగా, 6.3% మంది భౌతిక, మానసిక, లైంగిక హింసను, వేధింపుల బారినపడ్డారు. 17.9% మంది మాత్రం ఉద్యోగం చేసుకునే చోట ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉపాధి పొందే చోట భౌతికంగా హింస, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు 8.5% మంది పేర్కొనగా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు.

‘పని ప్రదేశాల్లో వేధింపులు ప్రమాదకరమైన అంశం. దీనివల్ల వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆదాయ నష్టం వాటిల్లి, వారి కెరీర్‌ దెబ్బతింటోంది’అని సర్వే అభిప్రాయపడింది. ప్రభావవంతమైన చట్టాలు, విధానాలను రూపొందించి ఈ సమస్యను పరిష్కరించవచ్చునని పేర్కొంది.

ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష

మరిన్ని వార్తలు