వచ్చేవారం అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చలు

3 Apr, 2021 04:56 IST|Sakshi

బ్రసెల్స్‌: ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఇరాన్, అమెరికా దేశాల మధ్య వచ్చేవారం పరోక్ష చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలతో ఇరాన్‌ అణు కార్యక్రమంపై పరిమితి విధించే దిశగా ఒప్పందం కుదిరే అవకాశముంది. మధ్యవర్తుల ద్వారా ఈ చర్చలు జరుగుతాయని శుక్రవారం ఇరాన్, అమెరికా ప్రకటించాయి. ఇప్పటికే ఈ అంశంపై ఇరుదేశాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందం నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో మూడేళ్ల కిత్రం  అమెరికా వైదొలగింది. 2015 నాటి ఒప్పందం మేరకు ఇరాన్‌ తన అణు కార్యక్రమంపై స్వీయ ఆంక్షలు విధించుకోవాలి. అలాగే, అమెరికా, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇరాన్‌కు ఆంక్షల సడలింపుతో పాటు ఆర్థిక సాయం అందించాలి.

ఇరాన్‌తో ఒప్పందానికి ప్రాధాన్యత ఇస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. చర్చలు వియెన్నాలో మంగళవారం ప్రారంభమవుతాయని అమెరికా హోం శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ వెల్లడించారు. ఇది సరైన ముందడుగు అని, అయితే, వెంటనే సానుకూల ఫలితాలను ఆశించలేమని వ్యాఖ్యానించారు. అమెరికా–ఇరాన్‌ మధ్య ఈ పరోక్ష చర్చలు ప్రారంభం కావడానికి యూరోపియన్‌ యూనియన్‌ మధ్యవర్తిత్వం చేసింది. 

మరిన్ని వార్తలు