ఎగిరే కారుకు అమెరికా అనుమతి

1 Jul, 2023 05:06 IST|Sakshi

2025 నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామన్న అలెఫ్‌ కంపెనీ  

మోడల్‌–ఎ ధర రూ. 2.46 కోట్లు..

ప్రారంభమైన బుకింగ్‌  

కాలిఫోర్నియా:   తాము తయారు చేసిన ఎగిరే కారు(ఫ్లయింగ్‌ కారు)కు అమెరికా ప్రభుత్వం నుంచి చట్టబద్ధ అనుమతి లభించిందని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్‌ ఏరోనాటిక్స్‌ కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ వర్టీకల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌(ఈవీటీఓఎల్‌) వెహికల్‌ అని పిలిచే ఈ కారు పూర్తిగా విద్యుత్‌తో పనిచేస్తుంది. ఫ్లయింగ్‌ కారును తొలిసారిగా 2022 అక్టోబర్‌లో అలెఫ్‌ కంపెనీ ఆవిష్కరించింది.

రోడ్లపైనే పరుగులు తీయడమే కాదు, గాల్లోనూ ప్రయాణించడం ఈ కారు ప్రత్యేకత. హెలికాప్టర్‌ తరహాలో గాల్లోకి నిలువుగా ఎగరగలదు. నిలువుగా భూమిపై దిగగలదు. మోడల్‌–ఎ ఫ్లయింగ్‌ కారు ఒకసారి పూర్తిగా చార్జింగ్‌ చేస్తే రోడ్డుపై 200 మైళ్లు(322 కిలోమీటర్లు), గాలిలో 110 మైళ్లు(177 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర 3 లక్షల అమెరికన్‌ డాలర్లు(రూ.2.46 కోట్లు). 150 డాలర్లు (రూ.12,308) చెల్లించి అలెఫ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఫ్లయింగ్‌ కారును బుక్‌ చేసుకోవచ్చు.

ఇప్పటికే ప్రజల నుంచే కాకుండా కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని అలెఫ్‌ ఏరోనాటిక్స్‌ కంపెనీ వెల్లడించింది. మోడల్‌–ఎ కార్ల ఉత్పత్తిని 2025 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని ప్రకటించింది. తమ ఎగిరే కారుకు యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) నుంచి స్పెషల్‌ ఎయిర్‌వర్తీనెస్‌ సర్టీఫికెట్‌ లభించిందని అలెఫ్‌ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి వాహనానికి అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ఇదే మొదటిసారి అని తెలియజేసింది. మోడల్‌–ఎ మాత్రమే కాకుండా మోడల్‌–జెడ్‌ తయారీపైనా అలెఫ్‌ సంస్థ దృష్టి పెట్టింది. మోడల్‌–జెడ్‌ను 2035 నుంచి మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మోడల్‌ డ్రైవింగ్‌ రేంజ్, ఫ్లయింగ్‌ రేంజ్‌ మరింత అధికంగా ఉంటుంది. ఇందులో ఆరుగురు ప్రయాణించవచ్చు. 

మరిన్ని వార్తలు