దౌత్యాధికారుల తగ్గింపు వ్యవహారం.. కెనడాకు అమెరికా, యూకేల మద్దతు

22 Oct, 2023 06:08 IST|Sakshi

లండన్‌/వాషింగ్టన్‌: కెనడాకు చెందిన 41 మంది దౌత్యాధికారుల హోదాను రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంతో తాము విభేదిస్తున్నట్లు అమెరికా, యూకేలు ప్రకటించాయి. సిక్కు వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య అనంతరం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని భారత్‌ తీసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపాయి.

వియన్నా ఒప్పంద సూత్రాలకు భారత్‌ ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకమని యూకే పేర్కొనగా, విభేదాల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో దౌత్యాధికారుల అవసరం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ నొక్కి చెప్పింది. ‘దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను గుర్తిస్తాయని మేం ఆశిస్తున్నాం. దౌత్యవేత్తల భద్రత కోసం కల్పించాల్సిన అధికారాలు, ఇతర హక్కులను ఏకపక్షంగా తొలగించడం వియన్నా సూత్రాల విరుద్ధం.

హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై స్వతంత్ర దర్యాప్తులో కెనడాతో పాలుపంచుకోవాలని భారత్‌ను కోరుతూనే ఉన్నాం’అని యూకే విదేశాంగశాఖ పేర్కొంది.‘భారత్‌లో దౌత్యాధి కారులను గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం డిమాండ్‌ చేయడం, కెనడా తన దౌత్యవేత్తలను వెనక్కి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విభేదాలను పరిష్కరించడానికి క్షేత్ర స్థాయిలో దౌత్యవేత్తలు అవసరం. దౌత్యా ధికారులను తగ్గించాలంటూ కెనడాపై ఒత్తిడి తేవద్దని, నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరాం’అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు