Muscat: షాకింగ్‌ దృశ్యాలు.. బ్యాడ్మింటన్‌ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన వ్యక్తి

11 Jan, 2023 12:40 IST|Sakshi

భారతీయుల్లో గుండెపోటు కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. యవసుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. వృద్ధుల కంటే 50 ఏళ్ల లోపు ఉన్న వారిలోనే ఈ మరణాలు ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు, ఫిట్‌గా ఉన్నవారు సైతం ఉన్నంటుడి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మస్కట్‌లో చోటుచేసుకుంది.

బ్యాడ్మింటన్‌ ఆడుతూ భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అనూహ్య రీతిలో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. నలుగురు స్నేహితులు బ్యాడ్మింటన్‌ ఆడుతూ కనిపిస్తున్నారు. బ్యాడ్మింటన్‌ కోర్టులో ఎంజాయ్‌ చేస్తూ గేమ్‌ ఆడుతున్నారు. అయితే సెకన్ల వ్యవధిలో పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించిన వ్యక్తి.. గేమ్‌ ఆడుతూ ఉన్నట్టుండి కోర్టులోనే కుప్పకూలిపోయాడు.

ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డ స్నేహితులు వెంటనే అతడి దగ్గరికొచ్చి లేపే ప్రయత్నం చేశారు. కానీ అతడు లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి అతను ఆకస్మిక గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. బ్యాడ్మింటన్‌  ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. నిమిషం నిడివి గల ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

కాగా ఈ ఘటన జనవరి 2న జరిగినట్లు తెలుస్తోంది మృతుడి వయసు 38 ఏళ్లు ఉండగా అతడు కేరళకు చెందినవ్యక్తిగా సమాచారం. బాధితుడికి భార్య, ఇద్దరుపిల్లలు ఉన్నారు. స్వతహాగా క్రీడా ప్రేమికుడైన ఆ వ్యక్తి తరుచుగా దేశీయ క్రికెట్ లీగ్‌లోనూ ఆడేవాడని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు