హిజాబ్‌ ధరించలేదని యువతులపై పెరుగుతో దాడి.. వీడియో వైరల్‌

2 Apr, 2023 19:41 IST|Sakshi

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్‌ విషయంలో ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు, యువతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఆందోళనకారులను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం సైతం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా హిజాబ్‌ సరిగా ధరించలేదనే కారణంతో ఓ వ్యక్తి ఇద్దరు యువతులపై అనుచితంగా ప్రవర్తించాడు. బహిరంగ ప్రదేశాల్లో తమ జుట్టును హిజాబ్‌తో కప్పి ఉంచనందుకు ఇద్దరు మహిళలపై పెరుగుతో దాడి చేశాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు యువతులు హిజాబ్‌ పూర్తిగా ధరించకుండా కిరాణ షాప్‌లోకి వెళ్లారు. వాళ్లను ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన ఓవ్యక్తి ఇద్దరితో కొద్దిసేపు  ఆగ్రహంగా మాట్లాడాడు. ఎందుకు హిజాబ్‌ ధరించలేదంటూ వాగ్వాదానికి దిగాడు. వెంటనే కోపంలో దుకాణంలో ఉన్న పెరుగును తీసి ఇద్దరి తలలపై విసిరేశాడు. ఊహించని పరిణామంతో ఇద్దరు యువతులు అలాగే ఉండిపోయారు. దీంతో షాప్‌ యజమాని బయటకు వచ్చి దాడి చేసిన వ్యక్తిని చితకబాదాడు.

చివరికి ఈ ఘటన పోలీసుల వరకు చేరింది. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులుతెలిపారు. అతనితోపాటు ఇద్దరు యువతులను కూడా అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. హిజాబ్‌ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించినందుకు అదుపులోకి తీసుకుంటున్న చెప్పారు. ఇదిలా ఉండగా ఇరాన్ అధికారిక చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల పై వయసున్న బాలికలు, మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధనలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు