ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!

4 Oct, 2021 20:18 IST|Sakshi

వాషింగ్టన్‌: సాధారణంగా వివాహాలంటే మండపంలోనో, గుడిలోనో లేదా ఇంటి దగ్గర చేసుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ జంట మాత్రం తమ పెళ్లిని రెండు దేశాల సరిహద్దుల మధ్య చేసుకుంది. ఎందుకలా అనుకుంటున్నారా! దానికి ఓ కారణం ఉందిలెండి. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాలో నివసిస్తున్న కరెన్ మహోనీ, బ్రియాన్ రేకు  వివాహం జరగాల్సి ఉంది. అయితే వధువు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండగా, కెనడాలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది.

ఇటీవల కరోనా కారణంగా ఆయా దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో అమెరికా, కెనడా మధ్య ఉన్న ఆంక్షల కారణంగా వధువు కుటుంబ సభ్యులు ఈ పెళ్లి కోసం న్యూయార్క్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ జంట ఈ వేడుక తమ కుటుంబ సభ్యుల మధ్యే జరగాలని నిర్ణయించుకున్నారు. అందుకు వేదికను ఏకంగా సరిహద్దు వద్దకు మార్చారు. అదృష్టవశాత్తు సరిహద్దు భద్రతా సిబ్బందిలో ఒకరు వాళ్లకు తెలియడంతో ఈ పని సులువుగా మారింది. దీంతో న్యూయార్క్‌లోని బర్కి, కెనడాలోని క్యూబెక్ మధ్య ఉన్న జమీసన్ లైన్ బోర్డర్ క్రాసింగ్‌లో వారి పెళ్లి వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

ఈ తతంగమంతా కెనడా సరిహద్దులో ఉన్న కరేన్‌ తల్లిదండ్రులు, నానమ్మ వీక్షించారు. ఈ రకంగా వివాహం చేసుకోవడంపై వధువు కరేనా... పెళ్లి అనేది ఎవరికైనా జీవితంలో ముఖ్యమైన రోజు. అలాంటి  ప్రత్యేకమైన రోజుని నా తల్లిదండ్రులు, నానమ్మ సమక్షంలో జరగాలని నేను కోరుకున్నాను. మా కుటుంబ పెద్ద నానమ్మ ఒక్కరే. నా జీవితంలో సంతోషకరమైన రోజును చూడడంతో పాటు ఆ రోజు ఆమె నా దగ్గర ఉండాలనుకున్నానని తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటజన్లు వీరి ఐడియాను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: Viral Video: సింగిల్‌గా ఉంటే సింహమైనా సైలెంట్‌గా ఉండాలి.. లేదంటే

>
మరిన్ని వార్తలు