లండన్‌ మెట్రోలో దుబాయ్‌ యువరాజు.. హవ్వా ఎవరూ గుర్తు పట్టలేదే!

16 Aug, 2022 15:22 IST|Sakshi

ఓ దేశానికి, రాజ్యానికి రాజు అంటే ఎన్ని రాజభోగాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్యాలెస్‌లో సకల సౌకర్యాలు ఉంటాయి. అడుగు బయటపెట్టినా భద్రత దృష్ట్యా వారు ప్రత్యేకంగా కార్లు, విమానాలు, హెలిక్యాప్టర్‌లలో తిరుగుతుంటారు. అయితే వీటికి భిన్నంగా దుబాయి క్రౌన్‌ ప్రిన్స్‌ మెట్రోలో ప్రయాణించారు. అంతేగాక తోటి ప్రయాణికులు అతన్ని యువరాజుగా గుర్తు పట్టకపోవడం మరో పెద్ద విశేషం.

దుబాయి యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ మక్తూమ్‌ తన కుటుంబం, స్నేహితులతో కలిసి లండన్‌ వెకేషన్‌లో ఉన్నారు. హాలిడే ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను 14 మిలియన్ల ఫాలోవర్స్‌ కలిగిన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోల్లో యువరాజు లండన్‌లోని అండర్‌ గ్రౌండ్‌ మెట్రోలో సామాన్యుడిలా ప్రయాణించారు. షేక్ హమ్దాన్ తన స్నేహితుడు బద్ర్‌ అతీజ్‌తో కలిసి నిత్యం రద్దీగా ఉండే లండన్ మెట్రో  కంపార్ట్‌మెంట్ మధ్యలో నిల్చొని సెల్ఫీ దిగారు. 

‘మేము చాలా దూరం వెళ్ళవలసి ఉంది. బద్ర్(సౌదీ అరేబియాలోని ఓ ప్రాంతం) ఇప్పటికే విసుగొచ్చింది’ అని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ దాదాపు వారం క్రితం షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే రైలులోని మిగతా ప్రయాణికులు వీరిద్దరినీ గుర్తించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ విలాసవంత ప్రయాణాన్ని వదిలేసి ఇలా మెట్రోలో సామాన్య పౌరుడిగా ప్రయాణించడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  
చదవండి: అక్కడ లాక్‌డౌన్‌ అంటే చాలు జనాలు జంప్‌! వీడియో వైరల్‌

A post shared by Fazza (@faz3)

మరిన్ని వార్తలు