రష్యా ప్రజలకు ఊహించని షాక్‌.. టెన్షన్‌లో పుతిన్‌..?

6 Mar, 2022 08:48 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 11వ రోజుకు చేరుకున్నాయి. దాడుల నేపథ్యంలో రష్యా బలగాలు అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ప‌లు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌పై ప‌ట్టును సాధించే ప్రయత్నం చేస్తున్న ర‌ష్య‌న్ బ‌ల‌గాలు ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాల‌కు తెగ‌బ‌డుతున్నారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ర‌ష్య‌న్ సైనికులు తమ దేశ ప్రజలపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఆరోపించారు. 

మరోవైపు దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికన్‌ పేమెంట్‌ సంస్థలైన వీసా, మాస్టర్​కార్డ్​.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్‌ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రష్యాలో వీసా కార్డు సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆయన వెల్లడించారు. 

ఇదిలా ఉండగా..  ఉక్రెయిన్‌ పూర్తి స్థాయిలో సైబర్‌ వార్‌ను ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్‌ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. యువకులు డిజిటల్‌ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో రష్యా సైతం తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్‌ ద్వారా  మాల్‌వేర్‌లు పంపించి ఇంటర్నెట్‌ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య డిజిటల్‌ యుద్ధంతో యూరప్‌ దేశాలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  

మరిన్ని వార్తలు