వివేక్‌తో విందుకు ఫీజు 50 వేల డాలర్లు

24 Sep, 2023 05:52 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామితో కలిసి మాట్లాడుకుంటూ విందారగించాలనుకుంటున్నారా? అలాగైతే సుమారు రూ.42 లక్షలు చెల్లిస్తే చాలు..! సిలికాన్‌ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు కొన్ని వివేక్‌కి ఎన్నికల ప్రచార నిధులను సేకరించి పెట్టేందుకు ఈ నెల 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి.

ఇందులో వివేక్‌తోపాటు పాల్గొనాలనుకునే వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని రూ.41.47 లక్షలు (50 వేల డాలర్లు)గా ఖరారు చేశారు. విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఇన్వెస్టర్, సోషల్‌ కేపిటల్‌ సంస్థ సీఈవో చమత్‌ నివాసంలో ఈ విందు జరగనుంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో అగ్రస్థానంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్‌ రామస్వామి నిలిచిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు