ఉన్నత విద్యకోసం వెళ్లి.. మంత్రి అయ్యారు!

3 Nov, 2020 17:00 IST|Sakshi

న్యూజిలాండ్‌ మంత్రిగా ఎన్నికైన భారత సంతతి తొలి మహిళ ప్రియాంక రాధాకృష్ణన్‌

రాష్ట్ర ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు: కేరళ సీఎం

వెల్లింగ్‌టన్‌/తిరువనంతపురం: న్యూజిలాండ్‌ మంత్రిగా ఎన్నికైన భారత సంతతి తొలి మహిళగా ప్రియాంక రాధాకృష్ణన్‌ సోమవారం చరిత్ర సృష్టించారు. అభ్యుదయ భావాలతో, అసమాన పాలనాదక్షతతో ముందుకు సాగుతున్న ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ కేబినెట్‌లో కమ్యూనిటీ అండ్‌ వాలంటరీ సెక్టార్‌ మంత్రిగా, సామాజికాభివృద్ధి, ఉద్యోగకల్పన సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించనున్నారు. ఉన్నత చదువుల కోసం కివీస్‌ దేశానికి వెళ్లి అక్కడే స్థిరపడి.. రాజకీయపరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక రాధాకృష్ణన్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలు..

స్వస్థలం కేరళ
ప్రియాంక రాధాకృష్షన్‌(41) స్వస్థలం కేరళలోని ఎర్నాకులం జిల్లా. వారి పూర్వీకులు ఉత్తర పరావూర్‌కు చెందినవారు. ఆమె తండ్రి పేరు ఆర్‌ రాధాకృష్ణన్‌. ఆయన ఉన్నత విద్యావంతులు. కాగా ఉన్నత విద్య కోసం తొలుత సింగపూర్‌కు వెళ్లిన ప్రియాంక, ఆ తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లి డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ చేశారు. ఈ క్రమంలో ఆక్లాండ్‌లో సామాజిక కార్యకర్తగా జీవితం ఆరంభించిన ఆమె.. 2006లో వామపక్ష భావజాలం గల లేబర్‌ పార్టీలో చేరారు. 2017లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. జెసిండా నేతృత్వంలోని లేబర్‌పార్టీలో  కీలక నేతగా ఎదిగి మంత్రిగా పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.(చదవండి: జెసిండా మరో సంచలనం)

తాతయ్య నుంచి వారసత్వంగా..!
ప్రియాంకకు రాజకీయాలేమీ కొత్తకాదు. ఆమె ముత్తాత(తల్లి తరఫున) డాక్టర్‌ సీఆర్‌ క్రిష్ణ పిళ్లై కమ్యూనిస్టు పార్టీ నేతగా కేరళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కాగా తన కూతురి రాజకీయ జీవితం గురించి ప్రియాంక తండ్రి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మాసే యూనివర్సిటీ స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫీసర్‌గా పోటీ చేసి తొలిసారి విజయం అందుకున్న ప్రియాంక, లెఫ్ట్‌పార్టీ నేతల అండతో న్యూజిలాండ్‌లో రాజకీయ జీవితం ఆరంభించినట్లు వెల్లడించారు. 

న్యూజిలాండ్‌ కోడలు అయ్యారు!
ఇక అభ్యుదయ భావాలు గల ప్రియాంక న్యూజిలాండ్‌ పౌరుడు రిచర్డ్‌సన్‌ను వివాహం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గృహ హింస బాధితుల తరఫున పోరాడే ఓ ఎన్జీవోలో భాగమైన ప్రియాంకతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. ఆయన కూడా ఇటీవలే లేబర్‌ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. కాగా ప్రియాంక సాధించిన విజయం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశి థరూర్‌, కేరళ మంత్రి శైలజ, తెలంగాణ ఐటీశాఖా మంత్రి కె.తారకరామారావు వంటి ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు శుభాభినందనలు తెలియజేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం.. కేరళ మూలాలున్న ప్రియాంక సాధించిన విజయం పట్ల తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు