ఆఫ్రికన్‌ గాడిదలను ఎత్తుకెళ్లి సుత్తెలతో కొట్టి చంపి.. చైనా దుర్మార్గపు మెడిసిన్‌ మాఫియా వెలుగులోకి!

9 Jul, 2022 21:29 IST|Sakshi

కరోనా టైంలో చైనా ఆహారపు అలవాట్ల గురించి ప్రధానంగా చర్చ నడిచింది. ఒకానొక టైంలో ఆ అలవాట్ల వల్లే కరోనా విజృంభించిందన్న వాదన సైతం చక్కర్లు కొట్టింది. అయితే.. చైనీస్‌ సంప్రదాయ మందుల తయారీ కోసం మూగజీవాలను పొట్టనబెట్టుకుంటుందని ఆ దేశం మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా.. ఆఫ్రికాలో సైతం గాడిదలను ఎత్తుకెళ్లి దేశాలు దాటించి మరీ చంపి.. సంప్రదాయ మందులు తయారు చేస్తున్న చైనా దుర్మార్గపు చేష్టలు వెలుగులోకి వచ్చాయి.

ఇంప్రెసెస్‌ ఇన్‌ ది ప్యాలెస్‌ అనే చైనీస్‌ టీవీ షో కారణంగానే.. ఈ విషయం వెలుగు చూడడం గమనార్హం.  పదులు, వందలు కాదు.. లక్షల్లో గాడిదలను సంప్రదాయ మందుల పేరిట బలిగొంటోంది చైనా. మూగజీవాలను ఎత్తుకెళ్లి మరీ సుత్తెలతో కొట్టి చంపి మరీ అమానుషంగా వ్యవహరిస్తోంది. గాడిదల చర్మం నుంచి తయారు చేసే ఎజియావో అనే సంప్రదాయ మందు కోసం ఆరాచకాలకు పాల్పడుతోందని యూకేకు చెందిన డాంకీ శాంక్చురీలో పని చేసే సైమన్‌ పోప్‌ ఆరోపిస్తున్నారు. 

ఎజియావో అనేది ‘డాంకీ గ్లూ’గా పిలుస్తారు చైనాలో. గాడిదల చర్మం నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ టానిక్‌ వల్ల ఆరోగ్యంతో పాటు అందంగా ఉంటారని చైనీయుల నమ్మకం. అందుకే.. గాడిదలను దుర్మార్గంగా చంపేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చైనాలో ఈ టానిక్‌ తయారీకి సరిపడా గాడిదలు లేవు. అందుకే.. విదేశాలపై దృష్టి సారించింది. ప్రధానంగా ఆఫ్రికాలో గాడిదల సంఖ్యపై ఆధారపడింది. 

ఈ మేరకు మాలి, జింబాంబ్వే, టాంజానియాలో అక్రమ దందాలకు చైనా తెర తీసిందని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా కథనం ప్రచురించింది. అక్కడి ప్రజలకు గాడిదలు ప్రధాన జీవనాధారం. వాటిని అమ్ముకునేందుకు ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో.. వాటిని ఎత్తుకెళ్లే చేష్టలకు దిగింది చైనా మాఫియా. మొత్తం ఐదు మిలియన్ల గాడిదలకుగానూ.. సొంతగడ్డపై రెండు మిలియన్లు, విదేశాల నుంచి మరో మూడు మిలియన్ల గాడిదలను రప్పించుకుంటోంది. అయితే.. వాయిస్‌ ఆఫ్‌ అమెరికా కథనం ప్రకారం ఆ మూడు మిలియన్లలో 25 నుంచి 35 శాతం గాడిదలు ఎత్తుకొచ్చినవే అని తెలిపింది. 

తమ తమ దేశాల్లో గాడిదల సంఖ్య తగ్గిపోతుండడంపై ఆయా దేశాలు దృష్టిసారించాయి ఇప్పుడు. తమ దేశంలో గాడిదలు అంతరించిపోయే దశకు చేరుకోవడంతో.. టాంజానియా గత నెలలో గాడిదల వధ, చర్మం వర్తకాలపై నిషేధం విధించింది. నైజీరియా కూడా ఇదే బాటలో పయనిస్తూ నిషేధం ప్రకటించింది. తమ గాడిదలు తమ దేశాల సంపదని.. వాటిని అమ్మడం, చంపడం కుదరంటూ కొన్ని దేశాలు ఇప్పటికే డ్రాగన్‌ కంట్రీకి గట్టి సంకేతాలు పంపాయి.

మరిన్ని వార్తలు