World Water Day 2022: థీమ్‌ ఎంటో తెలుసా?

22 Mar, 2022 13:30 IST|Sakshi

మార్చి నెల ముగియకుండానే మండే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎండలతోపాటు మనకు గుర్తొచ్చేది నీరు. నీరు లేకపోతే జీవం లేదు. నీరు  కరువైతే ప్రకృతి లేదు.. మనిషి మనుగడ లేదు.  ప్రపంచవ్యాప్తంగా  తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క అల్లాడి పోతున్న అభాగ్యులెందరో.   నీటి వనరులు, భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నా అంతులేని నిర్లక్ష్యం. అందుకే నీటి  సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు  ప్రతీ ఏడాది మార్చి 22న  ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తుంచుకుంటాం.  గంగమ్మ తల్లి సంరక్షణలో పౌరులుగా మన బాధ్యతను గుర్తించాల్సిన సమయం ఇది. 


మంచినీటి కొరత ఇపుడొక ప్రపంచ సంక్షోభం. దీనిపై ప్రతీ  పౌరుడు అవగాహన  కలిగి  ఉండటంతోపాటు, బాధ్యతగా వ్యవహరించాల్సిన  సమయమిది. నీటి పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాలంటూ 1992లో రియో డి జనేరియోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సు తీర్మానించింది. అలా  1993లో మొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకున్నాం.  ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో వరల్డ్‌ వాటర్‌ డేని నిర్వహించడం ఆనవాయితీ. 2022 ఏడాదికి సంబంధించి 'గ్రౌండ్ వాటర్: మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్'   అనేది థీమ్‌. నానాటికి అదృశ్యమైన పోతున్న భూగర్భ జలాల్ని కాపాడుకోవడం అనే లక్ష్యంతో ఈ ఏడాది  ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించు కోవాలని ఐక్యరాజ్యసమతి పిలుపునిచ్చింది.   ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అంద జేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.  


భూగర్భ జలాలు కనిపించవు, కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. కనుచూపు మేరలో, మన కాళ్ళ కిందుండే భూగర్భ జలాలు మన జీవితాలను సుసంపన్నం చేసే  గొప్ప నిధి.  ఈ విషయాన్ని గుర్తించక మానువుని అంతులేని నిర్లక్ష్యం,  అత్యాశ  పెనుముప్పుగా పరిణ మిస్తోంది.  ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే మనం మాత్రం తాగునీటిని వృధా  చేస్తున్నాం. సముద్రాలు, నదులు, కాలువలు, చెరువులు  అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తున్నాం. కలుషితం చేస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే  కొనసాగితే..2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమైన నీరు లభించదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు మానవ అవసరాల పేరుతో అడవులను విచక్షణా రహితం నరికిపారేస్తున్నాం. అటవీ నిర్మూలనతో జీవవైవిధ్యం దెబ్బ తినడమే కాదు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, అతి వినియోగం, సహజ వనరుల దోపిడీకారణంగా తీవ్రమైన నీటి కొరత లాంటి దారుణమైన పరిస్థితులను  జనజీవనం ఎదుర్కొంటోంది. వీటన్నింటికి తోడు కాలుష్య కాసారం వుండనే ఉంది. నీటిని వృధా చేయడం అంటే రాబోయే తరాలకు భవిష్యత్తులేకుండా  చేయడమని అందరం అర్థం చేసుకోవాలి. ఈ  భూగోళంలో కేవలం 0.3 శాతం మాత్రమే శుద్ధనీటి వనరులు ఉన్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టూ విలువైనదే అన్న అవగాహన పెంచుకోవాలి. ఈ భూ ప్రపంచంపై మానవుడితో పాటు సమస్త ప్రాణికోటి సుభిక్షంగా సురక్షితంగా మనుగడ సాగించాలి అంటే ప్రతీ నీటిచుక్కను రక్షించుకోవాలి. ఈ అవగాహన, బాధ్యత ప్రతీ ఒక్క మనిషిలోనూ రావాలి. లేదేంటే తగిన మూల్యం చెల్లించక  తప్పదు.

మరిన్ని వార్తలు