ఇంటి అద్దె డిపాజిట్‌ చెల్లించాలి.. కిడ్నీ అమ్ముతా.. కొంటారా?

28 Feb, 2023 22:02 IST|Sakshi

బనశంకరి: ఇటీవల రోజుల్లో జీవితం చాలా ఖరీదైనదిగా మారింది. కూరగాయలు, పండ్లు, వంట సరుకులు, దుస్తులు, ఇంటి అద్దె, స్కూలు ఫీజులు, పెట్రోలు, మొబైల్‌ ఖర్చు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అంతం ఉండదు. ఇక బెంగళూరు వంటి మహానగరమైతే చెప్పనక్కర్లేదు. ఇక్కడ అద్దె ఇల్లు కావాలంటే నెలవారి బాడుగ 10 లేదా 12 నెలల మొత్తాన్ని యజమానికి డిపాజిట్‌ చేయాలి. ఇందుకు లక్షలాది రూపాయల డబ్బు కావాలి. ఇష్టమైన ప్రాంతంలో ఇల్లు కావాలంటే నెల అంతా కష్టపడిన డబ్బు ఇంటి బాడుగకే ఖర్చుచేయాలి.

బాడుగ బాధలకు అద్దం

ఈ కష్టాలను ప్రతిబింబిస్తూ, అద్దె ఇంటికి డిపాజిట్‌ చెల్లించడానికి డబ్బు కావాలి, అందుకుగాను నేను నా మూత్రపిండాన్ని విక్రయిస్తా అని ఎవరో ఒక వ్యక్తి ఇందిరానగరలో అట్టముక్కపై రాసిపెట్టాడో వ్యక్తి. ఎడమ కిడ్నీని విక్రయిస్తానని పోస్టర్‌లో తెలిపాడు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది ట్విట్టర్‌, ఇన్‌స్టాలో ఈ ఫోటోను పోస్ట్‌ చేస్తూ బెంగళూరే కాదు, ప్రపంచం అంతటా అద్దె ఇళ్ల ఇబ్బందులు ఎలా ఉంటాయో వర్ణించడం జరుగుతోంది. ఈ పోస్టర్‌ వల్ల బెంగళూరులో హెచ్చుమీరుతున్న అద్దె, డిపాజిట్‌ పట్ల చాలా చర్చ మొదలైంది. అంతమొత్తాన్ని బాడుగ కట్టేబదులు నగరానికి దూరంగా ఎక్కడైనా తక్కువ అద్దెకు ఇల్లు తీసుకుని, మిగిలిన మొత్తంతో కారు కొని ఈఎంఐలు కట్టవచ్చని ఒక నెటిజన్‌ చెప్పాడు. సదరు వ్యక్తి పెట్టిన పోస్టర్‌ నిజమైనా, లేక హాస్యానికై నా అద్దె ఇళ్ల భారం నానాటికీ పెరిగిపోతోందని వాపోయారు.

ఇంటి అద్దె డిపాజిట్‌ చెల్లించాలి

బెంగళూరులో చర్చనీయాంశమైన పోస్టర్‌

మరిన్ని వార్తలు