సౌధ దగ్గర గంధం చెట్టు చోరీ | Sakshi
Sakshi News home page

సౌధ దగ్గర గంధం చెట్టు చోరీ

Published Wed, Nov 22 2023 1:44 AM

చెట్టును కొట్టివేసిన దృశ్యం  - Sakshi

శివాజీనగర: రాత్రికి రాత్రి దొంగలు పడి శ్రీగంధం చెట్టును నరికి ఎత్తుకెళ్లారు, ఇదెక్కడో అడవిలో జరిగిన ఘటన కాదు, శక్తి కేంద్రం విధానసౌధకు కూతవేటు దూరంలో జరిగిన దొంగతనం ఇది. కేఆర్‌ సర్కిల్‌లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ట్రాఫిక్‌ రద్దీ ఉంటుంది. ఇక్కడే ఉన్న ఎస్‌జే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ఆవరణలో 15 సంవత్సరాల నుంచి మూడు శ్రీగంధం చెట్లు ఉన్నాయి. వీటిలో ఒక చెట్టును సోమవారం రాత్రి నరికి ఎత్తుకెళ్లారు. చోరీ గురించి ప్రిన్సిపాల్‌ సదాశివమూర్తి విధానసౌధ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి దగ్గరిలోనే విధానసౌధ, మరోవైపు డీజీపీ కార్యాలయం ఉంటాయి. అయితే దొంగలు ఎలాంటి జంకు గొంకు లేకుండా గంధం చెట్టును కొట్టుకెళ్లడం గమనార్హం. పోలీసులు గంధం చోరుల కోసం గాలింపు చేపట్టారు.

పెళ్లికి ఓకే..

పోక్సో కేసు మాఫీ

యశవంతపుర: బాధితురాలు, పోక్సో కేసులో అరెస్టయిన నిందితుడు రాజీ పడి, పెళ్లికి సిద్ధం కావడంతో ఆ కేసును హైకోర్టు రద్దు చేసింది. కోలారు జిల్లా చింతామణి పోలీసుస్టేషన్‌లో దాఖలైన పోక్సో కేసును హైకోర్టు ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. బాధిత బాలిక మేజర్‌ కావటంతో నిందితునితోనే పెళ్లి చేయడానికి ఇరువైపు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. దీంతో కేసును రద్దు చేయాలని బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. జైల్లో ఉన్న నిందితున్ని పోలీసులు హైకోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. తాము పెళ్లి చేసుకుంటామని, కేసులు వద్దని ఇద్దరూ చెప్పడంతో న్యాయమూర్తి కేసును మాఫీ చేశారు. నెల రోజులలోపు పెళ్లి జరగాలని హైకోర్టు షరతు విధించింది.

రూ. కోటి పరిహారమివ్వాలి

యశవంతపుర: కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకా చిణమగేరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సాంబారు పాత్రలో పడి మరణించిన 2వ తరగతి బాలిక మహంతమ్మ (8) కుటుంబీకులు న్యాయం కోసం ధర్నా చేశారు. అఫ్జలపుర ఎమ్మెల్యే ఎంవై పాటిల్‌ పరామర్శకు రాగా, కోటి రూపాయల పరిహారంతో పాటు బాలిక తల్లికి ఉద్యోగం ఇవ్వాలని, మృతురాలి తమ్ముని చదువు ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాలిక మృతికి పాఠశాల సిబ్బంది కారణమని ఉపాధ్యాయులు, వంట మనుషులను సస్పెండ్‌ చేయాలని దేవల గాణగాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కావేరి జలదీక్ష

మండ్య: తమిళనాడుకు కావేరి నిటిని వదలరాదని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో మండ్య నగరంలో నిరసన కొనసాగుతోంది. సర్‌ ఎం.వీ విగ్రహం ఎదుట ధర్నా దీక్షలో మంగళవారం పాల ఉత్పత్తిదారులు, సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొని మద్దతు తెలిపారు. జాతీయ రహదారిపై కూడా బైఠాయించారు. కావేరి నిరసనలు ఇప్పటికి 78వ రోజుకు చేరాయి.

దోసకాయల అవ్వ కన్నుమూత

తుమకూరు: భారత్‌ జోడో యాత్రలో తుమకూరులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి తినడానికి దోసకాయలు ఇచ్చిన వీధి వ్యాపారి శారదమ్మ (78) మంగళవారం కన్నుమూసింది. రాహుల్‌కు దోసకాయలు ఇవ్వడం ద్వారా ఆమె ప్రచారాంశమైంది. గతేడాది అక్టోబర్‌ 9న రాహుల్‌గాంధీ చిక్కనాయకనహళ్ళి పట్టణంలో నడక సాగిస్తుండగా, ఫుట్‌పాత్‌పై శారదమ్మ దోసకాయలు అమ్ముతూ ఉంది. రాహుల్‌ను పిలిచి ఆమె రెండు దోసకాయలను ఇచ్చారు. తన పొలంలో పండించిన దోసకాయలను మీకోసం తెచ్చానని చెప్పడంతో రాహుల్‌ ఆమెను అక్కున చేర్చుకున్నారు. వయసు మీద పడడంతో ఆమె కుమారుని ఇంట్లో కన్నుమూసింది.

1/2

రాహుల్‌గాంధీతో 
శారదమ్మ (ఫైల్‌)
2/2

రాహుల్‌గాంధీతో శారదమ్మ (ఫైల్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement