ఉద్యోగుల ఆనంద హేల

7 Jun, 2023 01:50 IST|Sakshi
ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 29వేల మంది ఉద్యోగులకు మేలు

మచిలీపట్నంటౌన్‌: ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉద్యోగవర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వాలు హామీని ఇచ్చి వాటి పరిష్కారానికి కాలయాపన చేయటం తప్ప ఆచరణ చేసిన దాఖలాలు లేవు. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుండటంతో వారంతా జేజేలు పలుకుతున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇదీ పరిస్థితి..

మంత్రివర్గం, ఉద్యోగుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావటంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో 29 వేల మంది ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ వైద్యశాలల్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మందికి 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించటం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించటం, 12వ పీఆర్సీ కమిషన్‌ను త్వరలో నియమిస్తామని చెప్పడం, నాలుగేళ్లలో పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లింపు వంటి నిర్ణయాలతో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే 2014 జూన్‌ 2వ తేదీ నాటికి 5 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించటంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 వేల మంది ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

రేపు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం..

మంగళవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఎన్‌జీవోల సంఘ జిల్లా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఉద్యోగులు మంగళవారం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నెల 8వ తేదీ గురువారం మచిలీపట్నం కలెక్టర్‌ కార్యాలయం వద్ద సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయనున్నట్లు ప్రకటించారు.

ఉద్యోగుల పక్షమని నిరూపించారు..

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేదల పక్షమే కాదు.. ఉద్యోగుల పక్షాన కూడా నిలబడతారని సోమ వారం జరిగిన చర్చల ద్వారా రుజువైంది. ఉద్యోగులు కోరుతున్న పలు డిమాండ్లకు సానుకూలంగా స్పందించటం హర్షణీయం. సీఎం జగన్‌కు ధన్యవాదాలు.

– ఎగ్గోని గాంధీ, వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

మరిన్ని వార్తలు