కోతకొచ్చిన వేళ కలవరం | Sakshi
Sakshi News home page

కోతకొచ్చిన వేళ కలవరం

Published Wed, Nov 22 2023 1:16 AM

మోపిదేవిలో వర్షానికి నేలవాలిన వరి చేను  - Sakshi

అవనిగడ్డ: వరి కోతకొచ్చిన సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. మంగళవారం తెల్లవారు జామునుంచి పడుతున్న వర్షానికి దివిసీమలో పలుచోట్ల వరి దుబ్బులు పడిపోయాయి. ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో వరికోతలకు సిద్ధమైన కొంతమంది రైతులు ముసురుతో వరికోతలు వాయిదా వేసుకున్నారు.

వర్షాలు కొనసాగితే తీవ్ర నష్టం

అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో మొత్తం 1.02 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో ముందుగా నాట్లు వేసిన పొలాలు వరికోతకు సిద్ధమయ్యాయి. మంగళవారం తెల్లవారు జామునుంచి చెదురు మదురుగా కురుస్తున్న వర్షాలకే కొన్ని ప్రాంతాల్లో వరి దుబ్బులు పడిపోయాయి. కొద్దిపాటి చినుకులకే దుబ్బులు పడిపోగా, వర్షాలు పెరిగినా గాలులు వీచినా నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో ఆలస్యంగా నాట్లు వేసిన పొలాలు ప్రస్తుతం పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షం పడితే సుంకులోకి నీరు వెళ్లి తాలు కంకులు వస్తాయని కొంతమంది రైతులు చెప్పారు. దిగుబడులు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముసురు వల్ల ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో వరికోతలను రైతులు వాయిదా వేసుకున్నారు.

దివిసీమలో వర్షాలతో నేలవాలినవరి చేను ముసురుతో కోతలు వాయిదా

దిగుబడి తగ్గుతుంది

వేకనూరు లంకలో సాగుచేసిన వరిపంట కోత కొచ్చింది. ఈ సమయంలో వర్షాలు పడినా, గాలులు వీచినా పంట పడిపోతుంది. చేను నేలవాలితే అన్నింటా నష్టమే. దిగుబడి తగ్గుతుంది. కోతలు కోసి కట్టివేత వేయడానికి ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు వర్షం రైతుకు అన్నింటా చేటే. –తుంగల సీతారామయ్య,

వేకనూరు, అవనిగడ్డ మండలం

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement