భర్తపై భార్య రాసిన క్రైం కథా చిత్రంలో మరో మహిళ బలి!

18 Jan, 2024 07:30 IST|Sakshi

పెనమలూరు: భర్తపై భార్య రాసిన క్రైం కథా చిత్రంలో ఓ మహిళ బలైంది. ప్రియుడితో కలిసి భర్తను జైలుకు పంపుదామని స్కెచ్‌ వేసి.. అందుకు పరిచయం ఉన్న ఓ మహిళను సాయం కోరి.. చివరకు ఆ మహిళనే చంపేసి.. నేరం భర్తపై తోసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్‌ అయ్యింది. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోని రీతిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గన్నవరం సర్కిల్‌ డీఎస్పీ జయసూర్య మంగళవారం పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు..

అసలు ఏమైంది?
విజయవాడ కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన గరిగల నాగమణి (30) కానూరు 100 అడుగుల రోడ్డులో ఈ నెల 14వ తేదీన శవమై కనిపించింది. సమాచారం తెలుసుకున్న సీఐ రామారావు ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. మృతురాలు నాగమణి ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టగా నాగమణి ఫొటోను గుర్తించిన ఆమె భర్త కిరణ్‌గోపాల్‌ పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించేందుకు సీఐ రామారావుతో పాటు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. సీన్‌ కట్‌ చేస్తే..

లవ్‌ స్టోరీ ఇలా..
ప్రసాదంపాడుకు చెందిన రిషేంద్ర, ఐతాబత్తుల మృధులాదేవి(40) 2007లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త ప్రైవేటు కంపెనీలో డెప్యూటీ మేనేజర్‌గా పని చేస్తుండగా, మృధులాదేవి బాడీకేర్‌ సెంటర్‌లో పని చేస్తుంది. మృధులాదేవి కృష్ణలంకు చెందిన పోలాసి సాయిప్రవీణ్‌ (30) అనే వ్యక్తి 2021లో కస్టమర్‌గా వచ్చి పరిచయం అవ్వటంతో అది కాస్త పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత మృధులాదేవీ భర్తను పిల్లలను విడిచిపెట్టి ప్రియుడు సాయిప్రవీణ్‌తో 2022లో వెళ్లిపోయింది. పోలీసుల సాయంతో తిరిగొచ్చినా.. మరలా వెళ్లిపోయింది. ఆ తర్వాత తానే మళ్లీ 2023 ఫిబ్రవరిలో భర్త రిషేంద్ర వద్దకు తిరిగి వచ్చి, తాను మారిపోయానని నమ్మించి, అతని పంచన చేరింది.

అసలు కథ ఇక్కడే..
సాయిప్రవీణ్‌కు మృధులాదేవికి ఆమె భర్త రిషేంద్ర అడ్డుగా ఉండటంతో ఇద్దరూ కలిసి పథకం రచించారు. మృధులాదేవి తన భర్త రిషేంద్రను శాశ్వతంగా జైలుకు పంపితే అడ్డు తొలిగి పోతుందని ఆలోచన చేసింది. దీనిలో భాగంగా కృష్ణలంకలో గతంలో సాయిప్రవీణ్‌ ఇంట్లో అద్దెకు ఉన్న నాగమణిని పావుగా వాడారు. నాగమణికి ఆర్థికసాయం చేస్తానని సాయిప్రవీణ్‌ ఎరవేశాడు. నాగమణి భర్త 13వ తేదీ ఏలూరుకు వెళ్లిన తరువాత ఆమెను ఎనికేపాడుకు రప్పించాడు. ఆమెను ఆటోలో కానూరు 100 అడుగుల రోడ్డులోకి తీసుకు వచ్చాడు. నాగమణి ఫోన్‌లోనే ఆమె వాయిస్‌ను సాయిప్రవీణ్‌ రికార్డు చేశాడు.

మృధులాదేవి భర్త రిషేంద్ర తనను శారీరకంగా వాడుకున్నాడని, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడని, నాకు ఏదైనా జరిగితే రిషేంద్రే కారణమని నాగమణి వాయిస్‌ రికార్డు చేశాడు. ఆ తర్వాత నాగమణిపై దాడి చేసి చున్నీతో మెడకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి, ఆమె ఫోన్‌ మాత్రం తీసుకొని అక్కడి నుంచి కంకిపాడు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తన మిత్రుడు ఎస్‌. మూర్తిబాబు(28) సహకారంతో వచ్చేశారు. రాత్రి 9.45 గంటలు దాటిన తరువాత నాగమణి వాయిస్‌ మెసేజ్‌తో పాటు కొన్ని టైప్‌ చేసిన మెసేజ్‌లు నాగమణి ఫోన్‌ నుంచే ఆమె భర్త కిరణ్‌గోపాల్‌కు అలాగే మృధులాదేవికి సాయిప్రవీణ్‌ పంపాడు. దీంతో ఈ హత్య మృధులాదేవి భర్త రిషేంద్ర చేశాడని పోలీసులు అతనిని అరెస్టు చేస్తారని, ఇక తమకు అడ్డుండదని సాయిప్రవీణ్‌, మృధులాదేవి భావించారు.

ఎవిడెన్స్‌ సేకరణ..
ఈ హత్యకు సంబంధించిన పూర్తి టెక్నికల్‌ ఎవిడెన్స్‌, సీసీ ఫుటేజీలు సేకరించామని డీఎస్పీ జయసూర్య చెప్పారు. నిందితులైన మృధులాదేవి, సాయిప్రవీణ్‌తో పాటు వీరికి సహకరించిన మూర్తిబాబును కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ టీవీవీ రామారావు, ఎస్‌ఐలు ఏసేబు, రమేష్‌, ఫిరోజ్‌, ఉషారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

అక్కడ దొరికింది క్లూ..
నాగమణి భర్త కిరణ్‌గోపాల్‌కు వచ్చిన మెసేజ్‌లు పోలీసులు పరిశీలించారు. అస్సలు చదువుకోని నాగమణి ఇంగ్లిష్‌లో మెసేజ్‌ పంపడం, వాయిస్‌ మెసేజ్‌లో నాగరాణి చాలా కూల్‌గా మాట్లాడటంపై పోలీసులు అనుమానించి లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మృధులాదేవి భర్త రిషేంద్రను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. తన భార్య మృధులాదేవికి కూడా ఈ విధంగానే మెసేజ్‌లు వచ్చాయని రిషేంద్ర పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో అనుమానంతో పోలీసులు మృధులాదేవి గురించి విచారణ చేయగా సాయిప్రవీణ్‌తో ఉన్న వివాహేతర సంబంధం వెలుగు చూ సింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి తమ దైన శైలిలో విచారించగా హత్య కేసు వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తులకు సాయం చేసేందుకు వెళ్లిన నాగమణి హత్యకు గురైంది.

>
మరిన్ని వార్తలు