విజయవాడకే ఐకాన్‌లా స్మృతివనం | Sakshi
Sakshi News home page

విజయవాడకే ఐకాన్‌లా స్మృతివనం

Published Thu, Jan 18 2024 1:56 AM

- - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇస్తూ విజయవాడలో భారీ విగ్రహం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని ఆంధ్రప్రదేశ్‌ రోడ్లు, భవనాలశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.మునికేశవులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ దాదాపు 19 ఎకరాల విస్తీర్ణంలో, నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతి వనం విజయవాడకే ఐకాన్‌లా నిలుస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. విగ్రహమే కాకుండా, ఆయన జీవిత విశేషాలతో కూడిన చిత్రాలతో కూడిన మ్యూజియం, థియేటర్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, ఫుడ్‌కోర్టు వంటివి ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాల్లో విజయవాడలో ఏర్పాటు చేసిందే అత్యంత ఎత్తయిందన్నారు. ఈ నెల 19న వేడుకలా నిర్వహించే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉద్యోగులు, అంబేడ్కర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): నగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన 206 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జోనల్‌ సెక్రటరీ గూటాల పాపారావు పిలుపునిచ్చారు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో బుధవారం డివిజన్‌ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశానికి చేసిన సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని కల్పించే దిశగా విగ్రహం ఏర్పాటు చేయడం జాతికే గర్వకారణమన్నారు. ఈ నెల 19న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా జరిగే విగ్రహావిష్కరణకు తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ఉద్యోగులతో పాటు పలుశాఖల ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ నేతలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, అంబేడ్కర్‌వాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ డివిజనల్‌ సెక్రటరీ కె.రమేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.వి రమణయ్య, నేతలు రాజీవ్‌, బీవీ నాయక్‌, వివి రత్నం, యోహను, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్లు, భవనాలశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మునికేశవులు

Advertisement
Advertisement