వక్ఫ్‌ బోర్డు పరిధిలోకి ఆస్తులు | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బోర్డు పరిధిలోకి ఆస్తులు

Published Thu, Jan 18 2024 1:56 AM

యనమలకుదురు ఈద్గా వద్ద పంచనామా చేస్తున్న అధికారులు  - Sakshi

పెనమలూరు: హైకోర్టు ఆదేశాల మేరకు గత కొంత కాలంగా వివాదంలో ఉన్న యనమలకుదురు ఈద్గా, కబరస్తాన్‌ వక్ఫ్‌ బోర్డుకు స్వాధీనం చేస్తూ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎల్‌.అబ్దుల్‌ఖాదిర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. యనమలకుదురులో ఈద్గా, కబరస్తాన్‌తో పాటు 26 దుకాణాల సముదాయం దాదాపు 2.73 ఎకరాల్లో ఉంది. చాలా కాలంగా ఒక వ్యక్తి చేతిలోనే ఆస్తులు ఉండటంతో వివాదం తలెత్తింది. కమిటీ వేసి దాని పర్యవేక్షణలోనే పాలన సాగించాలని మరో వర్గం పట్టుబట్టింది. ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించిన రెండవ వర్గం హైకోర్టులో కేసు వేసింది. కేసు పూర్వపరాలు విచారించి కబరస్తాన్‌, ఈద్గా, దుకాణాలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు వక్ఫ్‌ బోర్డును ఆదేశించింది. దీంతో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా బోర్డు ఇన్‌స్పెక్టర్‌ ఎండి.నూహుఆలీషా ఈద్గా, కబరస్తాన్‌, దుకాణాలు తమ పరిధిలోకి తీసుకొస్తూ సీఈవో ఉత్తర్వులను ఈద్గాకు అంటించారు. హుండీకి సీల్‌ చేశారు. ఇక మీదట దుకాణాల అద్దె, కరెంట్‌ బిల్లులు , ఈద్గా పాలన , ఇతర మెయింటెనెన్స్‌, జమా ఖర్చులు ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్‌, ఏపీ వక్ఫ్‌ బోర్డు అసిస్టెంట్‌ సెక్రెటరీ పర్యవేక్షిస్తారు. ఈ మేరకు జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి ఆస్తులపై వచ్చే సొమ్ము జమ చేస్తారు. ఈ సందర్భంగా జిల్లా వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ ఎండి.నుహుఆలీషా మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో ఆస్తులు పంచనామా చేశామన్నారు. దుకాణాల్లో ఉండే అద్దె దారులు అద్దె సొమ్ము బ్యాంకు ఖాతాలో మాత్రమే తప్పనిసరిగా జమ చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement