భూమా కుటుంబంలో మరోసారి అసమ్మతి చిచ్చు

15 Apr, 2023 10:45 IST|Sakshi

ఆళ్లగడ్డలో భూమా కుటుంబంలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ‘భూమా వర్గీయుల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో భూమా కిషోర్‌రెడ్డి నిర్వహించిన సమావేశం టీడీపీలో కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా కిషోర్‌ పోటీ చేస్తారా? లేదంటే టీడీపీ ఆయననే అభ్యర్థిగా ప్రకటిస్తుందా? అనే చర్చ మొదలైంది. రాజకీయంగా తన వైఖరితో పాటు అఖిల, భార్గవ్‌ లక్ష్యంగా కిషోర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 

సాక్షి ప్రతినిధి కర్నూలు: లోకేశ్‌ పాదయాత్ర జరుగుతున్న సమయంలో కిషోర్‌రెడ్డి సమావేశం చర్చనీయాంశమైంది. అఖిలపై విమర్శలు, తాను బరిలో ఉంటానని ప్రకటించడం రాజకీయంగా వేడి పెంచుతోంది. పొత్తులు ఉంటే బీజేపీ నుంచి.. లేదంటే మీరంతా అనుకుంటున్న పార్టీ నుంచి అని చెప్పడం ద్వారా పరోక్షంగా టీడీపీ తరపున పోటీలో ఉంటానని ప్రకటించారు. కొన్ని విషయాలు బహిర్గతం చేయలేనంటూనే టీడీపీతో టచ్‌లో ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే కిషోర్‌ ఏం మాట్లాడుతున్నారో తనకే స్పష్టత లేదనే చర్చ ఆళ్లగడ్డలో నడుస్తోంది.

తాను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ వర్గానికి నాయకత్వం వహిస్తారని, అలాంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారనే చర్చ కొనసాగుతోంది. బీసీ జనార్దన్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి.. కిషోర్‌ను వెనుక ఉండి నడిపిస్తున్నారని తెలుస్తోంది. అఖిలకు టిక్కెట్‌ రాకుండా వీరిద్దరూ పొత్తులు ఉంటే బీజేపీ తరఫున కిషోర్‌ను, లేదంటే టీడీపీ టిక్కెట్‌ దక్కేలా తెరవెనుక రాజకీయం చేస్తున్నారని ఆ పార్టీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ వైఖరిపై కిషోర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో టీడీపీ పూర్తిగా బలహీనపడిందన్నారు. ఆళ్లగడ్డ రమేశ్‌రెడ్డి కమిషన్‌ ఇవ్వలేదని రూ.3కోట్లకు ఫోర్జరీ సంతకం చేసి చెక్‌బౌన్స్‌ అయిందని భార్గవ్‌ కేసు వేయించారన్నారు. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన రమేశ్‌రెడ్డి పరిస్థితి ఇలా ఉందని, కమీషన్‌ల కోసం కార్యకర్తల రక్తం పీలుస్తున్నారన్నారు.

వీరి వైఖరితో చాగలమర్రి రాంపల్లి రఘునాథరెడ్డిరెడ్డి, రామోహన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిలను భార్గవ్‌ అవమానించి పార్టీని వీడేలా చేశారన్నారు. ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో చాలామంది కీలక నేతలు పార్టీ వీడారన్నారు. శివరామిరెడ్డి క్రషర్‌ను లాక్కోవాలని చూస్తే ఆయన దూరమయ్యారన్నారు. పాము తన పిల్లలు తానే తిన్నట్లు భార్గవ్, అఖిల కార్యకర్తలను తినేస్తున్నారని విమర్శించారు.   

‘భూమా’ వర్గం అంటూ ఏదీ లేదని, అది పూర్తిగా బలహీనపడిందని కిశోర్‌ పరోక్షంగా అంగీకరిస్తున్నారు. తద్వారా టీడీపీ కూడా అత్యంత బలహీనమైందని ఆయన మాటల్లోని అర్థం. అయితే ఇదే సమయంలో భూమా వర్గానికి అండగా ఉంటానని చెప్పడం గమనార్హం. ఇదిలాఉంటే కిశోర్‌ సమావేశాన్ని అఖిల తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనొక పిచ్చోడని, అలాంటి వ్యక్తి మాటలు పట్టించుకోవల్సిన అవసరం లేదని.. అతని వెనుక ఎవరు ఉన్నారో? ఎలా ఆడిస్తున్నారో తనకు తెలుసని అఖిల తన అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఆళ్లగడ్డలో అత్యంత దారుణంగా ఉన్న టీడీపీకి ఇలాంటి ఇంటిపోరు, వర్గపోరుతో మరింత నష్టం వాటిల్లనుంది.  

మరిన్ని వార్తలు