630 మొబైల్‌ ఫోన్ల రికవరీ

20 Nov, 2023 02:02 IST|Sakshi
రికవరీ ఫోన్లను పరిశీలిస్తున్న ఎస్పీ కృష్ణకాంత్‌

కర్నూలు: జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో ఆదివారం మొబైల్‌ రికవరీ మేళా నిర్వహించారు. రూ.1.26 కోట్ల విలువ చేసే 630 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ కృష్ణకాంత్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్‌ పోయిన తరువాత బాధ పడడం కంటే వాటిని పోగొట్టుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిదన్నారు. ఇటీవల కాలంలో మొబైల్‌ ఫోన్‌ జీవితంలో ఒక భాగంగా ఉందన్నారు. మొబైల్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కటీ అందులో నిక్షిప్తమై ఉంటుందని, దానిని పోగొట్టుకుంటే కలిగే బాధ వర్ణనాతీతమన్నారు. పర్సనల్‌ వివరాలు, ఫొటోలు, ఫోన్‌ నంబర్లు, వ్యాపార లావాదేవీలు, ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతా వ్యవహారాలు ఇలా చాలా మిస్‌ అవుతాయన్నారు. ఫోన్‌ పోగొట్టుకున్న వ్యక్తికి అది దొరకదని అనుకున్నప్పుడు మానసిక వేదన వివరించడం చాలా కష్టమన్నారు. ఈ ఆవేదనను దృష్టిలో ఉంచుకుని మొబైల్‌ ఫోన్లను కర్నూలు పోలీసులు కష్టపడి రికవరీ చేశారన్నారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ విజయశేఖర్‌, ట్రైనీ డీఎస్పీ భావన, సీఐలు శ్రీనివాసరెడ్డి, అబ్దుల్‌ గౌస్‌, శ్రీరామ్‌, పవన్‌కుమార్‌, సైబర్‌ ల్యాబ్‌ టెక్నికల్‌ టీమ్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌, మోహన్‌కిశోర్‌, ఖాజావలి, సైబర్‌ ల్యాబ్‌ టెక్నికల్‌ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొబైల్‌ పోతే...

మొబైల్‌ పోగొట్టుకున్నవారు http:// kurnoolpolice.in/mobiletheft లింకును క్లిక్‌ చేసి మొబైల్‌ వివరాలను తెలియజేస్తే త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామని సైబర్‌ ల్యాబ్‌ టెక్నికల్‌ సిబ్బంది తెలిపారు.

బాధితులకు అందజేసిన ఎస్పీ కృష్ణకాంత్‌

మరిన్ని వార్తలు